Nara Bhuvaneswari: ఆమె తెలుగు అగ్ర హీరో కుమార్తె.. ఆపై ముఖ్యమంత్రి గారాల పట్టే.. ముఖ్యమంత్రి భార్య.. ఓ మంత్రి మాతృమూర్తి.. ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతలు ఉన్నా.. తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని భావించారు. అలా కుమార్తెగా, భార్యగా, తల్లిగా, వ్యాపారవేత్తగా, సంఘ సేవకురాలిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలిచారు నారా భువనేశ్వరి( Nara Bhuvaneswari ). ప్రస్తుతం లండన్ లో ప్రతిష్టాత్మక రెండు అవార్డులను అందుకున్నారు. అయితే ఈ రాజకీయ, వ్యాపార ఉన్నత స్థితుల్లో ఎన్నో సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు.
* నందమూరి తారక రామారావు కుమార్తెగా ఉన్నారు భువనేశ్వరి. తన తండ్రి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, మంత్రి పదవి చేపట్టారు చంద్రబాబు. కాంగ్రెస్ పార్టీ నీ విభేదించి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు ఎన్టీఆర్. రెండు విరుద్ధ భావ పార్టీలు అయిన క్రమంలో చంద్రబాబుకు పిల్లను ఇచ్చారు నందమూరి తారక రామారావు. కానీ అటువంటి సమయంలో సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నారు భువనేశ్వరి. 1985లో చంద్రబాబు అదే టిడిపిలోకి వచ్చేసరికి ఊపిరి పీల్చుకున్నారు. ఎంతో ఆనందపడ్డారు.
* 1995లో తెలుగుదేశం పార్టీలో సంక్షోభం ఏర్పడిన సమయంలో నారా భువనేశ్వరి చాలా ఇబ్బంది పడ్డారు. తన తండ్రిని భర్త ఎదిరించి పార్టీని, ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు. అటువంటి క్లిష్ట సమయంలో భర్త చంద్రబాబు వైపు నిలబడ్డారు. తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించారు. అయితే అది మొదలు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారు అన్న అపవాదును ఎదుర్కొంటూ వచ్చారు. రాజకీయంగా విభేదించిన సమయంలో నందమూరి హరికృష్ణ ఇదే ఆరోపణలు చేసిన సమయంలో సైతం చాలా బాధలు పడ్డారు.
* వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో నిండు సభలో భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు. ఆ సమయంలో కూడా మొక్కవోని ధైర్యంతో నిలబడ్డారు. ఆ బాధను తట్టుకొని నిలబడగలిగారు.
* వైసిపి హయాంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. దాదాపు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. అక్రమ అరెస్టు అంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపట్టారు. కుమారుడు లోకేష్ ను సముదాయించారు. కోడలు బ్రాహ్మణితో పాటు మనుమడు దేవాన్సును కంటికి రెప్పలా కాపాడుకున్నారు. రాజమండ్రిలో బస్సులో ఉంటూనే.. భర్తకు అవసరమైన ఆహారాన్ని స్వయంగా ఉండి జైలుకు పంపించేవారు.
* ఇన్ని రకాల సంక్లిష్ట స్థితులను ఎదుర్కొన్న నారా భువనేశ్వరి నిజంగా ధైర్యమైన మహిళ. భర్త రాజకీయాల్లో బిజీగా ఉండగా వ్యాపారాన్ని అలవోకగా పూర్తి చేసేవారు. భారతదేశంలోనే హెరిటేజ్ ఫుడ్స్ ను అగ్రగామిగా తీర్చిదిద్దగలిగారు. మరోవైపు ఎన్టీఆర్ ట్రస్ట్ పేరిట పేద ప్రజలకు సేవలు చేస్తున్నారు. ఒక మహిళ ఇన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం, కుటుంబ అభివృద్ధిలో కీలక భాగస్వామ్యం కావడం చెప్పుకోదగ్గ గొప్ప విషయం.