Nara Bhuvaneshwari: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) సతీమణి భువనేశ్వరికి అరుదైన గౌరవం దక్కనుంది. వివిధ రంగాల్లో ఆమె చేసిన కృషికి గాను లండన్ లోని ఐఓడి సంస్థ డిస్టింగ్విష్టు ఫెలోషిప్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు స్వీకరించేందుకుగాను ఈరోజు ఆమె భర్త చంద్రబాబుతో కలిసి లండన్ వెళ్ళనున్నారు. నవంబర్ 4న లండన్ లోని గ్లోబల్ కన్వెన్షన్ వేదికగా జరిగే కార్యక్రమంలో ఆమె ఈ అవార్డు స్వీకరిస్తారు. సమాజంలో విశిష్ట సేవలు అందించే వ్యక్తులకు ఈ అవార్డు అందిస్తూ వస్తోంది ఐఓడీ సంస్థ. గతంలో ఈ గౌరవాన్ని పొందిన వారిలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, హిందూజా గ్రూప్ కో చైర్మన్ గోపీచంద్, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్ పర్సన్ రాజశ్రీ బిర్లా ఉన్నారు. ఇప్పుడు వారి సరసన నారా భువనేశ్వరి నిలవనున్నారు.
* సామాజిక సేవా కార్యక్రమాలతో..
నారా భువనేశ్వరి( Nara Bhuvaneswari ) ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో ఆమె హెరిటేజ్ ఫుడ్స్ బాధ్యతలు కూడా చూసేవారు. 1989లో హెరిటేజ్ ఫుడ్స్ ను ఏర్పాటు చేశారు చంద్రబాబు. రాజకీయాల్లో బిజీగా మారిన తర్వాత ఆ బాధ్యతలను భువనేశ్వరి చూస్తూ వచ్చారు. మంత్రి నారా లోకేష్ సైతం డైరెక్టర్ గా ఉండేవారు. అయితే లోకేష్ వివాహం తర్వాత కోడలు బ్రాహ్మణి హెరిటేజ్ బాధ్యతలు చూసుకుంటున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ బాధ్యతలను చూస్తున్న భువనేశ్వరి.. సమాజ హిత కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. మొన్నటికి మొన్న విజయవాడలో లుకేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సహాయార్థం.. సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ నేతృత్వంలో మ్యూజికల్ నైట్ కూడా నిర్వహించారు.
* భర్త అరెస్టుతో బయటకు..
నారా భువనేశ్వరి నందమూరి తారకరామారావు కుమార్తె. చంద్రబాబు సతీమణి. కానీ ఎన్నడూ రాజకీయ వేదికలు పంచుకొని ఆమె.. వైసిపి హయాంలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు మాత్రం బయటకు వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా నిజం గెలవాలి పేరిట కార్యక్రమాలు చేపట్టారు. అటు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో సైతం తరచూ పర్యటిస్తూ వస్తున్నారు. మొన్ననే కుప్పంలో సొంత ఇంట్లో గృహప్రవేశం చేశారు. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వాటికి గుర్తింపుగానే ఆమెకు ప్రతిష్టాత్మక ఈ అవార్డు లభించింది. ఇప్పటికీ హెరిటేజ్ ఫుడ్స్ ఎండి హోదాలో కొనసాగుతున్నారు. ఎక్స్ లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో జాతీయస్థాయిలో హెరిటేజ్ ఫుడ్స్ కు గోల్డెన్ పీకాక్ అవార్డు లభించింది. లండన్ వేదికపై ఈ అవార్డు కూడా ఆమె స్వీకరించనున్నారు.