Andhra Pradesh Formation Day: నవంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh) రాష్ట్ర అవతరణ. ఈరోజు వచ్చిందంటే చాలు రాష్ట్రమంతటా సందడే. ప్రతి గ్రామంలో, పట్టణంలో మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే పాట శ్రావ్యంగా వినిపించేది. స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం నాడు ప్రజల్లో ఎటువంటి దేశభక్తి భావం కనిపిస్తుందో.. నవంబర్ 1న ఏపీలో అటువంటి వాతావరణమే ప్రజల్లో కనిపించేది. కానీ ఇప్పుడు అది కూడా ఒక మధుర జ్ఞాపకం గా మిగిలిపోయింది. విభజిత ఆంధ్ర ప్రదేశ్ మూలంగా తెలంగాణ అవతరించింది. తెలంగాణకు అవతరణ దినోత్సవం ఏర్పడింది. ఏటా ఆ రాష్ట్రం జూలై 2 న ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది. ఏపీలో మాత్రం డైలమా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిన నవంబర్ 1న జరుపుకోవాలా? నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన రోజు జరుపుకోవాలా? అన్న సందిగ్ధత కొనసాగుతోంది.
* రెండు పార్టీలు విరుద్ధంగా..
నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు( Chandrababu) బాధ్యతలు స్వీకరించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత జూలై రెండు నుంచి పది రోజులపాటు నవ్యాంధ్ర నిర్మాణ దినోత్సవాలు జరుపుకోవాలని నిర్ణయించారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించారు. అప్పటినుంచి ఈ దినోత్సవము పై ఒక నిర్ణయానికి రాలేదు. రాజకీయ విరుద్ధ భావాలతో ప్రముఖమైన ఈ దినోత్సవం పై నీలి నీడలు కొనసాగుతున్నాయి. విభజిత రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోగా.. అవశేష ఆంధ్ర ప్రదేశ్ మాత్రం ఆ వేడుకకు దూరంగా మారింది.
* హోంమంత్రి ట్వీట్ తో..
రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారిపోయింది. జాతీయస్థాయిలో అప్రతిష్ట పాలయ్యింది. అందుకే ఇప్పుడు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కూడా రాజకీయం గా మార్చడం మరింత దిగజారుడు కు కారణం అవుతోంది. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలకు రాజకీయాలే ముఖ్యం అయిపోయాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవ విషయంలో కూడా ఇటువంటి సందిగ్ధత, రాజకీయాలు ఎంత మాత్రం సరికాదు. అయితే ఏపీ ప్రజలంతా మరిచిపోయారు కానీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరిచిపోలేదు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కనీసం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ తేదీని ఖరారు చేసి.. ఎప్పటిలాగే అధికారికంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుంది. కనీసం వచ్చే ఏడాదికైనా అధికారిక ప్రకటన వస్తే సముచితంగా ఉంటుంది.