Nandamuri Padmaja Passes Away: నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దివంగత నందమూరి తారక రామారావు కోడలు మృతి చెందారు. ఆయన కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి నందమూరి పద్మజ( Nandamuri Padmaja ) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. పద్మజ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బయలుదేరి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మంత్రి నారా లోకేష్ సైతం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుంటున్నట్లు సమాచారం.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి..
చనిపోయిన నందమూరి పద్మజ స్వయాన దగ్గుబాటి వెంకటేశ్వరరావు(Daggubati Venkateswarao) సోదరి. నందమూరి తారక రామారావు కుమార్తె పురందేశ్వరిని వెంకటేశ్వరరావు వివాహం చేసుకోగా.. వెంకటేశ్వరరావు సోదరి పద్మజాను నందమూరి జయకృష్ణ వివాహం ఆడారు. పద్మజా మృతితో నందమూరి కుటుంబంలో విషాదం అలుముకుంది. ఆమె మరణం పై పలువురు ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలు, నందమూరి అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు.
Also Read: స్త్రీ శక్తి పథకం.. గొప్పలకు పోతే భవిష్యత్తులో తిప్పలేనా?
చంద్రబాబు, లోకేష్ సంతాపం
సీఎం చంద్రబాబు( CM Chandrababu) పద్మజా మృతి పై స్పందించారు.’ బావమరిది నందమూరి జయకృష్ణ సతీమణి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి పద్మజ మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఈ ఘటన మా కుటుంబంలో విషాదం నింపింది. పద్మజ ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను’.. అంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు. మరోవైపు నారా లోకేష్ సైతం స్పందించారు.’ మామయ్య నందమూరి జయకృష్ణ గారి సతీమణి, పద్మజా అత్త కన్నుమూశారన్న వార్త నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. మా కుటుంబాన్ని అన్నివేళలా అండగా నిలిచే అత్త ఆకస్మిక మృతి మా కుటుంబానికి లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను ‘ అంటూ ట్వీట్ చేశారు నారా లోకేష్. మరోవైపు పద్మజ మరణ వార్త విన్న చంద్రబాబు హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో ఉన్న నారా లోకేష్ సైతం నేరుగా హైదరాబాదుకు వస్తారని తెలుస్తోంది. నందమూరి జయకృష్ణ పద్మజల కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. సీనియర్ నటి రాధిక రాడాన్ మీడియా నిర్మించిన ధమ్ అనే మూవీలో హీరోగా చేశారు.