Nagababu : ఎమ్మెల్సీగా మెగా బ్రదర్ నాగబాబు( Mega brother Naga babu) ప్రమాణస్వీకారం చేశారు. కొద్ది రోజుల కిందట ఎమ్మెల్యేల కోటా కింద ఆయన ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సతి సమేతంగా ఆయన హాజరయ్యారు. ముందుగా సీఎం చంద్రబాబును కలుసుకున్నారు. ఆయనతో చర్చలు జరిపారు. అనంతరం కూటమి నేతలతో వచ్చి ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నడుచుకుంటానని.. వారి ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు నాగబాబు. అయితే ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు మంత్రిగా ఎప్పుడు ప్రమాణస్వీకారం చేస్తారన్నది తెలియడం లేదు.
Also Read : జాతీయ పార్టీలకు షాక్ ఇచ్చిన టిడిపి!
* చంద్రబాబు ప్రకటన..
కొద్ది నెలల కిందట ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) కీలక ప్రకటన చేశారు. మెగా బ్రదర్ నాగబాబును క్యాబినెట్లోకి తీసుకుంటానని ప్రకటించారు. అయితే అది మొదలు అదిగో ఇదిగో అంటూ చాలా రకాల వార్తలు వచ్చాయి. అయితే నాగబాబు చట్టసభల్లో సభ్యుడు కాదు. ఒకవేళ ఆయనకు మంత్రి పదవి ఇచ్చిన ఆరు నెలల్లో చట్టసభల్లో సభ్యుడిగా ఎన్నుకోవాలి. అయితే ఎమ్మెల్సీ ని చేసిన తరువాత మంత్రి వర్గంలోకి తీసుకుంటారని ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీ కావడంతో మంత్రి పదవి ఎప్పుడు అన్నది చర్చగా మారింది. సీఎం చంద్రబాబును నాగబాబు కలవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రి పదవి కోసం చర్చించి ఉంటారని అంతా భావించారు. కానీ కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే కలిసారని తెలుస్తోంది.
* జనసేనలో కీలకంగా..
జనసేనలో ( Jana Sena )నాగబాబు కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. జనసేనతో పాటు కూటమి తరుపున ఈ ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. మూడు పార్టీల మధ్య పొత్తు కుదరడానికి నాగబాబు కూడా కీలకపాత్ర పోషించారు. 2024 ఎన్నికల్లో కూటమి తరుపున విస్తృత ప్రచారం కూడా చేశారు. దీంతో కూటమి అధికారంలోకి రావడంతో నాగబాబుకు తప్పకుండా పదవి దక్కుతుందని అంతా భావించారు. ఆయనకు రాజ్యసభ ద్వారా పెద్దల సభలో అడుగు పెట్టాలన్న ఆలోచన ఉందని వార్తలు వచ్చాయి. మొన్న ముగ్గురు రాజ్యసభ సభ్యుల ఎంపిక జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చివరి వరకు రేసులో ఉన్నారు నాగబాబు. చివరి నిమిషంలో సమీకరణలు మారడంతో నాగబాబు పేరు తప్పిపోయింది. క్రమంలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు.
* మరికొంత కాలం ఆగాల్సిందేనా..
నాగబాబు తో పాటు ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఓ ఐదుగురు ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజు వారితో ప్రమాణం చేయించారు. అయితే నాగబాబు ప్రమాణస్వీకారం చేయడంతో ఆ పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు కాబోయే మంత్రి అంటూ నినాదాలు కూడా వినిపించాయి. అయితే నాగబాబు మంత్రిగా ప్రమాణం ఇప్పుడే కాదని ప్రచారం సాగుతోంది. మరి కొద్ది రోజులు ఆగి విస్తరణ సమయంలో నాగబాబు కు ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. అయితే నాగబాబు విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
Also Read : ఆ కీలక నేతపై జగన్ ఆగ్రహం.. కోటరీ నుంచి ఔట్!