Nagababu : మెగా బ్రదర్ నాగబాబు( Nagababu ) మనసు మారిందా? జాతీయ రాజకీయాలపై దృష్టి మళ్లిందా? ఎంపీ పదవిని ఆయన కోరుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మొన్నటికి మొన్న ఏపీ నుంచి మూడు రాజ్యసభ పదవులు భర్తీ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నాగబాబు పేరు ప్రముఖంగా వినిపించింది. నాగబాబును రాజ్యసభకు పంపించి కేంద్రమంత్రిగా అవకాశం ఇస్తారని ప్రచారం నడిచింది. అయితే చివరి నిమిషంలో సమీకరణలు మారాయి. తెలుగుదేశం పార్టీ రెండు రాజ్యసభ పదవులను తీసుకుంది. బిజెపికి పవన్ ఒకటి కేటాయించాల్సి వచ్చింది. ఆర్ కృష్ణయ్య రాజీనామాతో ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి.. బిజెపి నుంచి ఆయనకు సర్దుబాటు చేయాల్సి ఉండడంతో అగ్రనేతల కోరిక మేరకు పదవిని వదులుకున్నారు పవన్ కళ్యాణ్. దీంతో అప్పటికప్పుడు సర్దుబాటు చేసేందుకు చంద్రబాబు క్యాబినెట్లోకి నాగబాబును తీసుకోనున్నట్లు ప్రకటించారు. అయితే నాగబాబు మాత్రం ఎంపీగా పెద్దల సభలో కూర్చోవాలని ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది.
* ఆ చాన్స్ ఎప్పుడో
నాగబాబుకు ( Naga babu )మంత్రి పదవి అన్నది ఎప్పుడో తెలియడం లేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరుగుతోంది. ఆయనకు మంత్రి పదవి ఇస్తే తప్పకుండా ముందుగా ఎమ్మెల్సీ ని చేయాలి. ఆ తరువాతే మంత్రివర్గంలోకి తీసుకోవాలి. అయితే మార్చి తరువాతనే ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా ఎమ్మెల్సీగా ఎన్నికై తరువాత మంత్రి పదవి చేపట్టాల్సి ఉంది. అయితే ఎందుకో మెగా బ్రదర్ నాగబాబు రాష్ట్ర రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఓసారి ఢిల్లీ రాజకీయాలు చూద్దామన్న కోరిక ఆయనలో ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే రాష్ట్రంలో ఖాళీగా అయిన రాజ్యసభ సీటు నుంచి తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నట్లు సమాచారం.
* ఆ రాజీనామాతో విజయసాయిరెడ్డి( Vijay Sai Reddy ) తాజాగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన రాజ్యసభ చైర్మన్ కు తన రాజీనామా పత్రాన్ని అందించారు. వ్యక్తిగత కారణాలు చెప్పడంతో రాజ్యసభ చైర్మన్ అక్కడికక్కడే అంగీకరించారు. దీంతో విజయసాయి రాజీనామాతో రాజ్యసభ సీటు ఖాళీ అయింది. దీంతో కూటమి పార్టీల్లో ఆశావహులు ఎవరికివారుగా ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు బిజెపి కి ఈ పదవి ఆఫర్ అయినట్లు ప్రచారం నడుస్తోంది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని.. తమ పార్టీకి చెందిన రెడ్డి సామాజిక వర్గం నేతతో భర్తీ చేస్తామని అమిత్ షా కోరినట్లు ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆ పదవి దక్కే అవకాశం ఉంది.
* అనుకోని అవకాశం
అయితే అనుకోని అవకాశంగా రావడంతో నాగబాబు( Nagababu ) ఇప్పుడు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఖాళీ అయిన ఈ రాజ్యసభ పదవిలో తనను ఎంపిక చేయాలని పవన్ పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై పవన్ ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వంలో పవన్ కీలక భాగస్వామిగా ఉన్నారు. జాతీయస్థాయిలో సమన్వయం కావాలంటే నాగబాబును రాజ్యసభకు పంపించడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అదే జరిగితే నాగబాబుకు రాజ్యసభ పదవి ఖాయం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మరి పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.