Mynampally Hanumantha Rao: రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రస్తుతం ఎన్నికల వాతావరణం లేకపోయినప్పటికీ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు అధికారపక్షం వర్సెస్ ప్రతిపక్షం అన్నట్టుగా తెలంగాణలో పరిస్థితి నెలకొంది.
ఇదే క్రమంలో కాంగ్రెస్ నాయకులపై గులాబీ పార్టీ అనుకూల మీడియా ఇష్టానుసారంగా వార్తలను ప్రసారం చేస్తోంది. కొన్ని సందర్భాలలో వ్యతిరేక కథనాలు శృతి మించుతున్నాయి. ప్రభుత్వం ఏం చేసినా సరే తప్పు అనేటట్టుగా గులాబీ పార్టీ మీడియా, సోషల్ మీడియా వ్యవహరిస్తున్నాయి.
సహజంగానే తన మీద వ్యతిరేకంగా వచ్చే కథనాలను ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా సహించలేడు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మినహాయింపు కాదు. అయితే ఇటీవల టీ న్యూస్, మిర్రర్ అనే యూట్యూబ్ ఛానల్లో తమ మీద ఇష్టానుసారంగా వ్యతిరేక కథనాలను ప్రసారం చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. అయితే ఇందులో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు ఒక అడుగు ముందుకు వేశారు. అదే కాదు గాంధీభవన్ వెళ్లి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వ్యతిరేకంగా టీ న్యూస్, మిర్రర్ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ లో ప్రసారమైన వ్యతిరేక కథనాలను ఆయన ప్రస్తావించారు. అంతేకాదు, తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
తన పార్టీ నాయకుల మీద వ్యతిరేక కథనాలను ప్రసారం చేస్తున్న టీ న్యూస్ కార్యాలయాన్ని నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. కేటీఆర్ మీద వ్యతిరేక కథనాలను ప్రసారం చేస్తే మహా టీవీ న్యూస్ ఛానల్ కార్యాలయం మీద దాడులు చేశారని.. ఇప్పుడు టీ న్యూస్ తన మీద వ్యతిరేక కథనాలను ప్రసారం చేస్తోందని.. అందువల్ల లక్ష మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో వెళ్లి టీ న్యూస్ కార్యాలయాన్ని నేలమట్టం చేస్తామని మైనంపల్లి హనుమంతరావు హెచ్చరించారు. “టీ న్యూస్ ఛానల్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తీవ్రస్థాయిలో వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తున్నారు. మమ్మల్ని తొక్కుతామంటూ బెదిరిస్తున్నారు. ఆ వీడియోలను పదేపదే ప్లే చేస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారి మీద ఇష్టానుసారంగా కథనాలను ప్రసారం చేస్తున్నారు. మా మీద వ్యతిరేక కథనాలను ప్రసారం చేస్తున్న టీ న్యూస్ కార్యాలయం పైకి లక్ష మంది కాంగ్రెస్ కార్యకర్తలతో వెళ్తాం. ఉదయం మొదలుపెడితే సాయంత్రం వరకు టీ న్యూస్ కార్యాలయం నేలమట్టమవుతుందని” మైనంపల్లి హనుమంతరావు హెచ్చరించారు.