Mudragada Padmanabha Reddy: పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసి తన పెద్దరికాన్ని పోగొట్టుకున్నారు ముద్రగడ పద్మనాభం. రాజకీయ నాయకుడిగా కంటే కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగానే ముద్రగడకు గుర్తింపు ఉంది. చాలా మృదుస్వభావి కూడా. అన్ని పార్టీల నేతలతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఎవరికీ కానీ వారిలా మారిపోయారు. లేనిపోని సవాల్ చేసి తన పేరును, ఉనికిని ప్రమాదంలో పడేశారు. ఇంతకాలం ఎంతో విలువలతో బతికిన ఆయన సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతున్నారు. తనలో తాను చాలా అంతర్మధనం చెందుతున్నారు.
పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ను తరిమేయకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానని ఎమోషన్ అయ్యారు. ఏకంగా మీడియా ముందు ప్రకటించారు. అయితే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించడంతో ముద్రగడ మాటమీద నిలబడ్డారు. తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా డిప్యూటీ సీఎం పవన్ పై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అసమర్థుడునని.. అందుకే కాపులకు రిజర్వేషన్ తేలేకపోయానని తెలిపారు. గతంలో చంద్రబాబు హయాంలో కాపు ఉద్యమం నడిపి.. జగన్ హయాంలో ఉద్యమం ఎందుకు నడపలేదని చాలామంది తనను తిడుతున్నారని.. దయచేసి తనను.. తన కుటుంబాన్ని బూతులు తిట్టించవద్దని పవన్ కళ్యాణ్ ని కోరారు. తన కుటుంబంలో ఏడుగురు సభ్యులను ఉన్నామని.. మనుషులను పంపించి చంపించి వేయాలని పవన్ కు సూచించారు. అంతటితో ఆగకుండా తాము అనాథలమని చెప్పుకొచ్చారు. పవన్ అభిమానులు తనను బూతులు తిడుతూ మెసేజ్ లు పంపుతున్న విషయాన్ని గుర్తు చేశారు.
పవన్ కళ్యాణ్ తనను తిట్టించడం ఆపి కాపులకు రిజర్వేషన్ తీసుకురావాలని కోరారు. రాష్ట్రంతో పాటు కేంద్రంలో పవన్ చెబితే వినే ప్రభుత్వాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేశారు. ఒక్క కాపు రిజర్వేషన్లే కాకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా తీసుకురావాలని… విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కరణం ఆపించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ముద్రగడ ఒకవైపు ఎమోషనల్ బ్లాక్ మెయిల్.. మరోవైపు సెటైరికల్ గా మాట్లాడుతుండడం విశేషం.