Mudragada – YCP : ముద్రగడ పద్మనాభం సైలెంట్ వెనుక కారణమేంటి? పవన్ తో రగడ తరువాత ఆయన ఆత్మరక్షణలో పడిపోయారా? అనవసరంగా ఎపిసోడ్ లోకి వచ్చానని బాధపడుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కాపు సమాజంలో ముద్రగడకు స్పెషల్ రెస్పెక్ట్ ఉండేది. కాపు ఉద్యమం కోసం పదవులు వదులుకున్న చరిత్ర ఆయనది. ఎన్టీఆర్ కు ఒక దండం పెట్టి మంత్రి పదవిని వదులుకొని బయటకు వచ్చారు. అందుకే ఇప్పటికీ ముద్రగడ అంటే కాపుల్లో ఒకరకమైన అభిమానం. అయితే గత ఎన్నికల ముందు, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన వ్యవహార శైలి ఆ అభిమానాన్ని మసకబార్చింది. అనుమానాలను రేకెత్తించింది.
2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ముద్రగడ తెరపైకి తెచ్చారు. ఎన్నికల్లో హామీ మేరకు కాపులను బీసీల్లో చేర్చాలని బలమైన ఉద్యమానికి నాంది పలికారు. రాజకీయాలకతీతంగా కాపులు ముద్రగడకు మద్దతిచ్చారు. ఆయన వెంట నడిచారు. ఉద్యమం పతాక స్థాయికి చేరింది. తుని విధ్వంసానికి దారితీసింది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వాన్న మసకబార్చింది. కాపు సమాజం టీడీపీకి ప్రత్యర్థిగా మారిపోయింది. వైసీపీ దానిని క్యాచ్ చేసుకుంది. అయితే ఎక్కడా ముద్రగడ చేతికి మట్టి అంటకుండా కాపు సమాజం వైసీపీ వైపు టర్న్ అయ్యింది. కనీసం కాపు సామాజికవర్గానికి చెందిన పవన్ ఉన్నా.. ఆయనకు సానుకూలంగా ఒక్క ప్రకటన ముద్రగడ వైపు నుంచి రాలేదు. అంటే ఇంటర్నల్ గా ఆయన మనసు వైసీపీ వైపు ఉందని అర్ధమైపోయింది.
2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ముద్రగడ వైసీపీ మనిషేనన్న రేంజ్ లో ఆయన వ్యవహార శైలి మారిపోయింది. నా పోరాటాన్ని కొంతమంది శంకిస్తున్నందున కాపు రిజర్వేషన్ ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టు స్వయంగా ముద్రగడే ప్రకటించేసరికి అందరికీ ఒక పిక్చర్ వచ్చేసింది. మధ్య మధ్యలో జగన్ కు అనుకూల, పొగడ్తల లేఖలు రాయడంతో వారి మధ్య బంధం బట్టబయలైంది. కానీ ముసుగు తీసి నేరుగా పార్టీలోకి వెళ్లాలంటే ముద్రగడకు ధైర్యం చాలడం లేదు. జగన్ తో ఇమగలనా? లేనా? అన్న భయం ఒక ఎత్తైతే.. ఆత్మాభిమానం ఆయనకు అడ్డు వస్తోంది.
అయితే ఒకానొక దశలో ధైర్యం చేశారు. ఎంపీ మిథున్ రెడ్డి వచ్చి చర్చలు జరిపారు. జగన్ పంపించిన సూత్రధారిగా ముద్రగడ ఇంటికి వచ్చారు. సముచిత స్థానంతో పాటు మంచి పదవీ యోగ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అటు తరువా కాకినాడ ఎంపీ వంగా గీత ఆధ్వర్యంలో మరో బృందం వచ్చి సాదరంగా ఆహ్వానించింది. కానీ పవన్ వారాహి యాత్రకు వచ్చిన తరువాత పిక్చర్ మారిపోయింది. ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పై పవన్ ఆరోపణలు చేస్తే.. ముద్రగడ తాను వకల్తా పుచ్చుకొని అడ్డంగా బుక్కయ్యారు. పవన్ కే రెండుసార్లు లేఖ రాసి సవాల్ చేశారు. కానీ పవన్ స్పందించలేదు. వృద్ధనేత హరిరామజోగయ్య ఘాటైన రిప్లయ్ తో కృంగిపోయారు. పవన్ మార్కు రాజకీయంతో వైసీపీలోకి వెళ్లాలన్న నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. కొద్దిరోజుల పాటు వ్యూహాత్మక మౌనమే మేలన్న నిర్ణయానికి వచ్చారు.