AP CM YS Jagan : విద్య ఇలా.. వైద్యం అలా.. ఇదేంది జగనన్న?

విద్య, వైద్య వ్యవస్థలను గాడిలో పెడతారని భావించారు. అందుకు తగ్గట్టుగానే జగన్ ఆలోచన చేశారు. కానీ అమల్లోకి తీసుకొచ్చేసరికి మాత్రం ఫెయిల్యూర్ అయ్యారు. ప్రజలకు నిరాశ మిగిల్చారు.

Written By: Dharma, Updated On : July 10, 2023 10:53 am
Follow us on

AP CM YS Jagan : ప్రజలకు విద్య, వైద్యం ముఖ్యం. పిల్లలను బాగా చదవించి ప్రయోజకులను చేయ్యాలని సగటు తల్లిందండ్రులు భావిస్తుంటారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు దరి చేరకూడదని భగవంతుడ్ని ప్రార్థిస్తుంటారు. ప్రభుత్వాలు కూడా వీటికి ప్రాధాన్యత ఇవ్వాలని సగటు మధ్యతరగతి జనం కోరుకుంటారు. అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ వీటికి ప్రాధాన్యత ఇచ్చేసరికి ప్రజలు ఎంతగానో సంతోషించారు. విద్య, వైద్య వ్యవస్థలను గాడిలో పెడతారని భావించారు. అందుకు తగ్గట్టుగానే జగన్ ఆలోచన చేశారు. కానీ అమల్లోకి తీసుకొచ్చేసరికి మాత్రం ఫెయిల్యూర్ అయ్యారు. ప్రజలకు నిరాశ మిగిల్చారు.

నాడునేడు పథకంతో పాఠశాలల రూపురేఖలను మార్చారు. కొత్త భవనాల ఏర్పాటుతో పాటు తరగతి గదుల స్వరూపాన్నే మార్చేశారు. ఫర్నీచర్, విద్యుత్ సదుపాయం.. ఇలా ఒకటేమిటి అన్ని వసతులను సమకూర్చారు. ఇందుకుగాను వేల కోట్ల రూపాయలు ఖర్చుచేశారు. ఇంత ఖర్చుపెట్టిన తరువాత యూటర్న్ తీసుకున్నారు. పాఠశాలలు, ఉపాధ్యాయుల సర్దుబాటుతో ఆశలన్నింటినీ నీరుగార్చేశారు. రోజుకో జీవోతో విద్యావ్యవస్థను గందరగోళంలో నెట్టేశారు. ముఖ్యంగా పాఠశాల విలీన ప్రక్రియతో ప్రభుత్వ విద్య ప్రశ్నార్థకంగా మిగిలింది. 4,200 పాఠశాలల్లో రెండే తరగతులను మిగిల్చారు.

జగనన్న ప్రభుత్వ పాఠశాలల్లో తెచ్చిన మార్పులు చూస్తుంటే నాకు మళ్లీ చదువుకోవాలనిపిస్తోంది అంటూ ఓ డైలాగును బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఏకంగా డాక్యుమెంటరీలనే ప్రదర్శిస్తున్నారు. మంత్రి రోజాతో పాటు లక్ష్మీపార్వతి తదితరులు ఈ కామెంట్ నే నిత్యం హైలెట్ చేస్తుంటారు. అయితే వాస్తవ పరిస్థితిలో చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ఆ స్థాయిలో విద్యార్థులు చేరుతున్నారా? అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. 2022 సెప్టెంబరు నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో 41,38,322 మంది విద్యార్థులు ఉండేవారు. 2023 ఫిబ్రవరి నాటికి ఆ సంఖ్య 39,95,992 మందికి తగ్గింది. ప్రస్తుతం 37, 50,293 మందికి చేరుకుంది. అంటే దాదాపు నాలుగు లక్షల మందికిపైగా విద్యార్థులు తగ్గారన్నమాట. కానీ వైసీపీ నేతలకు ఇవేవీ పట్టడం లేదు.

ప్రభుత్వ వైద్యం పరిస్థితి అలానే ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం మెరుగుపడడం లేదు. వైద్యులు, ఇతర సిబ్బంది నియామకం జరగడం లేదు. కానీ రోజుకో జీవోలతో అయోమయానికి గురిచేస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ అన్న కాన్సెప్ట్ మంచిదే. కానీ అరకొరగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుడ్నే ఫ్యామిలీ డాక్టర్ గా నియమించారు. మండలంలో ప్రతిరోజూ రెండు పంచాయతీల చొప్పున నెలకు రెండుసార్ల వెళ్లాలని కండీషన్ పెట్టారు. వెళ్లగలుగుతున్నారా? అంటే అదీ లేదు. ఉన్న ఒక్క డాక్టర్ వెళ్లిపోతుండడంతో ఆస్పత్రుల్లో ఓపీ నిలిచిపోతోంది.ఇటు రెండుపక్కలా దెబ్బే. ఇలా ఏ రకంగా చూసుకున్న విద్య, వైద్యం విషయంలో ఏదో చేయబోయి.. జగన్ సర్కారు ఏదేదో చేస్తోంది. ఫలితంగా ప్రజలకు నష్టం జరుగుతోంది.