MP CM Ramesh Vs MLA Adinarayana Reddy: ఏపీలో( Andhra Pradesh) కూటమిలో క్రమశిక్షణ కట్టు దాటుతోంది. ముఖ్యంగా రాయలసీమలో పరిస్థితి అదుపు తప్పుతోంది. కడప జిల్లాలో బిజెపి ఎమ్మెల్యే వర్సెస్ బిజెపి ఎంపీ అన్నట్టు పరిస్థితి మారింది. ఏకంగా ఎంపీ కి చెందిన కంపెనీపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గత కొద్ది రోజులుగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా సఖ్యతగా ఉండడం లేదు. ముఖ్యంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో సీఎం రమేష్ పెత్తనం ఏంటి అని ఆదినారాయణ రెడ్డి వర్గం జీర్ణించుకోలేకపోతోంది. అందుకే ఇప్పుడు దాడులకు దిగినట్లు తెలుస్తోంది. అయితే గతంలోనే ఆదినారాయణ రెడ్డి పై బిజెపి హై కమాండ్ కు సీఎం రమేష్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇప్పుడు ఏకంగా దాడికి దిగడంతో సీఎం రమేష్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
* ఇద్దరిదీ ఒకటే నియోజకవర్గం.. జమ్మలమడుగు( jammalamadugu ) నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచారు ఆదినారాయణ రెడ్డి. అదే సమయంలో అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు సీఎం రమేష్. స్వతహాగా పారిశ్రామికవేత్త. ఆపై సొంత నియోజకవర్గం జమ్మలమడుగులో అదానీ గ్రూపు ఆధ్వర్యంలో ఓ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి.. సబ్ కాంట్రాక్ట్ పొందారు సీఎం రమేష్. ఆయన నేతృత్వంలోని రిత్విక్ కన్స్ట్రక్షన్ సంస్థ 77 కోట్ల రూపాయల టెండర్ దక్కించుకుంది. ఇది ఎంత మాత్రం ఆదినారాయణ రెడ్డి వర్గానికి రుచించలేదు. తాను శాసనసభ్యుడిగా ఉండగా.. ఎంపీ ఎలా దక్కించుకుంటారు అన్నది ఆదినారాయణ రెడ్డి నుంచి వస్తున్న అభ్యంతరమట. అయితే ఇది చినికి చినికి గాలి వానలా మారి ఏకంగా రిత్విక్ కంపెనీ పై దాడి చేసే పరిస్థితి వచ్చింది. ఈ హఠాత్పరిణామంతో రిత్విక్ కంపెనీ ప్రతినిధులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో పోలీసులు సైతం చేతులెత్తేశారు. దీనిపై బీజేపీ హై కమాండ్‌కు మరోసారి ఫిర్యాదు చేసేందుకు సీఎం రమేష్ సిద్ధపడుతున్నారు.
* చాలా రోజులుగా ఆధిపత్య పోరు
ఆదినారాయణ రెడ్డి తో పాటు సీఎం రమేష్ ది( CM Ramesh) జమ్మలమడుగు నియోజకవర్గమే. తెలుగుదేశం పార్టీలో బలమైన నేతగా ఎదిగారు సీఎం రమేష్. అప్పట్లో టిడిపి ద్వారా రాజ్యసభకు వెళ్లారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆదినారాయణ రెడ్డి. అప్పటినుంచి వారిద్దరి మధ్య వైరం నడుస్తోంది. 2014 తర్వాత ఆదినారాయణ రెడ్డి టిడిపిలో చేరారు. అప్పుడు కూడా వారి మధ్య సఖ్యత లేదు. అయితే 2019 ఎన్నికల తరువాత ఆ ఇద్దరు నేతలు బిజెపిలో చేరారు. అయితే సీఎం రమేష్ ఉత్తరాంధ్ర నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కానీ తనకున్న పలుకుబడి, పరపతితో నిర్మాణరంగంలో కాంట్రాక్టులు దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలోనే జమ్మలమడుగులో పర్యాటక శాఖకు సంబంధించి ఓ నిర్మాణ టెండర్లు దక్కించుకున్నారు. అది ఎంత మాత్రం ఆదినారాయణ రెడ్డి వర్గానికి మింగుడు పడడం లేదు. అందుకే తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ ఇద్దరి పుణ్యమా అని కూటమి పార్టీల్లో ఐక్యత లోపిస్తోంది. అయితే గతంలో ఆదినారాయణ రెడ్డి ఇదే మాదిరిగా జెసి ప్రభాకర్ రెడ్డి తో పంచాయితీ పెట్టుకున్నారు. చివరకు అది సీఎంవో కార్యాలయం వరకు వెళ్ళింది. కానీ సీఎం రమేష్ తో తలెత్తిన వివాదం మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. చూడాలి బిజెపి హై కమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో..?