Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి బాలినేని యూటర్న్ తీసుకుంటున్నారా? మనసు మార్చుకున్నారా? తిరిగి వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో చేరుతారా? జనసేనలో అంత ప్రాధాన్యత దక్కడం లేదా? కూటమి ఆయనను గుర్తించడం లేదా? పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఎన్నికల ఫలితాల అనంతరం జనసేనలో చేరారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. జనసేనలో అత్యంత ప్రాధాన్యం దక్కుతుందని భావించారు. ఎమ్మెల్సీతో మళ్ళీ యాక్టివ్ రాజకీయాల్లో అడుగు పెట్టవచ్చని కలలు కన్నారు. అయితే పవన్ ప్రాధాన్యం ఇస్తున్నారే తప్ప పదవులు ఇవ్వడం లేదు. ప్రకాశం జిల్లాలో కూడా కనీసం జనసేన నేతలు పలకరించడం లేదు. ఒంగోలు టిడిపి ఎమ్మెల్యేతో విభేదాలు ఉన్నాయి. ఆయన సైతం బాలిలేనిని వ్యతిరేకిస్తున్నారు. అయితే పవన్ పై నమ్మకం ఉంచిన బాలినేని పార్టీలో కొనసాగుతూ వచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే మాత్రం కనీస ప్రాధాన్యత దక్కడం లేదు. ఈ తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రీఎంట్రీ ఇస్తారని ప్రచారం ప్రారంభం అయ్యింది.
* ప్రకాశం జిల్లాలో మార్క్..
ప్రకాశం జిల్లా ( Prakasam district) రాజకీయాల్లో బాలినేనిది ప్రత్యేక స్థానం. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు బాలినేని. యువజన కాంగ్రెస్ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలో చాలా యాక్టివ్ గా పని చేశారు. దానిని గుర్తించిన రాజశేఖర్ రెడ్డి 2004లో ఒంగోలు అసెంబ్లీ సీటు ఇచ్చారు. తొలిసారిగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు బాలినేని. దీంతో రాజశేఖర్ రెడ్డి మరో అడుగు వేసి మంత్రి పదవి ఇచ్చారు. 2009లో సైతం గెలిచిన బాలినేనికి మంత్రి పదవి కట్టబెట్టారు రాజశేఖర్ రెడ్డి. అయితే రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో కలత చెందారు బాలినేని. జగన్మోహన్ రెడ్డి కి మద్దతుగా నిలిచారు. జగన్ వెంట అడుగులు వేశారు. తన చేతిలో ఉన్న మంత్రి పదవిని సైతం వదులుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేయడం ప్రారంభించారు.
* వైసీపీలో కీలకంగా..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యుల్లో ఒకరిగా మెదిలారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి( Srinivas Reddy). 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. దీంతో జగన్మోహన్ రెడ్డి పిలిచి మరి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ప్రకాశం జిల్లా బాధ్యతలు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా రెండోసారి పోటీ చేశారు బాలినేని. గెలవడంతో జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు. ఎనలేని ప్రాధాన్యం కల్పించారు. అయితే మంత్రివర్గ విస్తరణ లో పదవి కోల్పోయారు బాలినేని. తనను మంత్రి పదవి నుంచి తీసేయడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటినుంచి ఒక రకమైన అసంతృప్తితో మెలిగారు. 2024లో అయీష్టతతోనే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ దారుణ పరాజయం చవిచూశారు. అయితే తదనంతర పరిణామాలతో వైసిపికి గుడ్ బై చెప్పారు. పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. అయితే పార్టీలో చేరి ఏడాది కాలం అవుతున్నా కనీసం గుర్తింపు దక్కకపోవడంపై ఆవేదనతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
* వైయస్ కుటుంబ బంధువు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు బాలినేని. రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి సమీప బంధువు కూడా. అయితే వైసిపి అంతర్గత రాజకీయాలతో పార్టీలో ఉండడం శ్రేయస్కరం కాదని భావించి బయటకు వచ్చారు. కానీ జనసేనలోకి వచ్చిన తరువాత వైసీపీలో ఉన్నంత గుర్తింపు కూడా లేదు. దీంతో తీవ్ర మనస్తాపంతో బాలినేని ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కూడా టాక్ నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.