MLC Elections : ఏపీలో( Andhra Pradesh) పట్టభద్రులు తెలుగుదేశం పార్టీకి జై కొట్టారు. తాజాగా జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టిడిపి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కృష్ణా- గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆలపాటి రాజా విజయం సాధించారు. ఉభయగోదావరి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపొందారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లోని ఐదు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను టిడిపి క్లీన్ స్వీప్ చేసినట్లు అయ్యింది. రెండేళ్ల కిందట తూర్పు, పశ్చిమ రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది.
* అప్పటినుంచి వైసిపి పతనం..
2019లో అధికారంలోకి వచ్చింది వైఎస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ. అటు తరువాత వచ్చిన అన్ని ఎన్నికల్లో సత్తా చాటింది. పంచాయితీ, ప్రాదేశిక, మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించింది. ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదన్న రీతిలో విశ్లేషణలు నడిచాయి. ఇటువంటి తరుణంలో 2023 మార్చిలో వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టుగా మారాయి. ఏకకాలంలో 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్లను టిడిపి కైవసం చేసుకుంది. జగన్మోహన్ రెడ్డికి కీలకమైన రాయలసీమలో సైతం సత్తా చాటింది తెలుగుదేశం పార్టీ. అప్పటివరకు ఉన్న రాజకీయ సమీకరణలను మార్చేసింది ఆ ఎన్నిక. దాంతోపాటు ఎమ్మెల్యే కోట కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ఒక ఎమ్మెల్సీ ని సాధించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేసింది తెలుగుదేశం. ఒక విధంగా చెప్పాలంటే అక్కడి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభం అయ్యింది.
Also Read : ఏపీ ప్రభుత్వానికే విద్యార్థులు, ఉద్యోగుల ఓట్లు.. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత లేనట్లేనా!
* 2023లో మూడు చోట్ల..
2023 మార్చిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ( graduation MLC) ఎన్నికల్లో టిడిపి ఘనవిజయం సాధించింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం నుంచి టిడిపి అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు ఘనవిజయం సాధించారు. అలాగే పశ్చిమ రాయలసీమ స్థానం నుంచి టిడిపి అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విజయం సాధించారు. కడప,అనంతపురం, కర్నూలు జిల్లాలకు కలుపుతూ రాయలసీమ పశ్చిమ నియోజకవర్గం ఉంది. అప్పట్లో ఇక్కడ నుంచి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలుపొందారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కంచర్ల శ్రీకాంత్ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో విస్తరించి ఉంది ఈ నియోజకవర్గం. అదే సమయంలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో ఉన్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ నుంచి టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు గెలిచారు.
* అన్ని టిడిపి ఖాతాలోనే
అయితే తాజాగా ఉభయగోదావరి జిల్లాల( Godavari district) పట్టభద్రుల స్థానం.. కృష్ణా- గుంటూరు జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల నియోజకవర్గాన్ని సైతం టిడిపి అభ్యర్థులు సొంతం చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఉన్న ఐదు పట్టభద్రుల స్థానాలు టీడీపీ ఖాతాలో పడినట్టే. సాధారణంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో కేవలం.. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారికి ఓట్లు ఉంటాయి. అంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టభద్రులు తెలుగుదేశం పార్టీకి ఏకపక్షంగా మద్దతు తెలిపినట్టే. ఈ ఐదు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో ఉమ్మడి 13 జిల్లాలు ఉన్నాయి. అన్ని జిల్లాల్లోని పట్టభద్రులు తెలుగుదేశం అభ్యర్థులకు జై కొట్టడం నిజంగా విశేషమే.
Also Read : ఏపీకి ప్రధాని మోదీ.. సడన్ టూర్.. కారణం అదే!