MLA commission call viral: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోంది. ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నారు. అభివృద్ధి పనులు జరిపిస్తున్నారు. కానీ అదే సమయంలో కొందరు ఎమ్మెల్యేల తీరు మాత్రం విమర్శలకు గురిచేస్తోంది. పనితీరు మార్చుకోవాలని ఎప్పటికప్పుడు నాయకత్వం హెచ్చరికలు జారీచేస్తోంది. కానీ కొందరి వైఖరిలో మార్పు రావడం లేదు. కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారి నుంచి ఈ తరహా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తీరుపై సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం నడుస్తోంది. కాంట్రాక్టు పనుల్లో కమీషన్ నిమిత్తం.. సొంత పార్టీ ఎంపీ పైనే ఎమ్మెల్యే ఒకరు గట్టిగానే డిమాండ్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. పెద్ద ఎత్తున బెదిరింపులకు దిగుతున్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం సోషల్ మీడియాలోనే కాదు ఏకంగా ప్రభుత్వ అనుకూల మీడియాలో కథనం రావడం విశేషం.
బెదిరింపుల పర్వం..
ఉమ్మడి అనంతపురం( Ananthapuram) జిల్లాలో టిడిపి ఎంపీ బంధువు ఏడు కోట్ల రూపాయల విలువైన పైపులైన్ పనుల టెండర్ను దక్కించుకున్నారు. అయితే ఆ పనులను తమకు అప్పగించాలని స్థానిక ఎమ్మెల్యే సదరు కాంట్రాక్టర్కు ఫోన్ చేసి బెదిరించినట్లు తెలుస్తోంది. లేదంటే 10 శాతం కమీషన్లు ఇచ్చుకోవాల్సిందేనని షరతు పెట్టినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ఎంపీ తోనే మాట్లాడుకోవాలని సదరు కాంట్రాక్టర్ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో సదరు ఎమ్మెల్యే తమ్ముడు రంగంలోకి దిగారు. నేరుగా ఎంపీ తో మాట్లాడారు. తమ నియోజకవర్గంలో ఎవరు పనులు చేసినా 10 శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ ఎంపీ అయినందునే ధైర్యంతో ఈ పనులు చేయిస్తున్నానని చెప్పినా ఎమ్మెల్యే తమ్ముడు వినలేదు. ఎంపీ అయినా విడిచిపెట్టొద్దని తన సోదరుడు చెప్పాడని తిరిగి గట్టిగానే మాట్లాడాడట.
లోకేష్ కార్యాలయం ఆరా..
అయితే ఈ పరిణామంతో ఎంపీ తీవ్ర కలత చెందారు. అధికార పార్టీగా ఉన్న తన విషయంలోనే అలా వ్యవహరిస్తారా? అంటూ నేరుగా హై కమాండ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో టీడీపీ పెద్దలు సదరు ఎమ్మెల్యే కు ఫోన్ చేసి తలంటారు. అయినా సరే సదరు ఎమ్మెల్యే విడిచిపెట్టలేదట ఎంపీని. మరోసారి తమ్ముడు తో నేరుగా ఫోన్లో బెదిరింపులకు దిగారట. అయితే అధికార ఎంపీ, ఎమ్మెల్యేల పేరు లేకుండానే ఈ కథనం వచ్చింది. దీనిపై మంత్రి లోకేష్ కార్యాలయం సీరియస్ గా ఆరా తీస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఒకవైపు అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వ పెద్దలు కష్టపడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఇలా ఎమ్మెల్యేలు వీధిన పడుతున్నారు. దీనిపై హై కమాండ్ దృష్టి పెట్టకపోతే మున్ముందు ఈ పరిణామాలు మరింత కృంగదీసే అవకాశం ఉంది.