MLA Daggubati Venkateswara Prasad: తెలుగుదేశం( Telugu Desam) పార్టీకి కొంతమంది ఎమ్మెల్యేలు చికాకు పెడుతున్నారు. పార్టీ గెలిచిన నాటి నుంచి చంద్రబాబు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నా వారి వైఖరిలో మాత్రం ఎంత మాత్రం మార్పు రావడం లేదు. కొంతమంది అయితే దారి తప్పి వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వైఖరి రోజురోజుకు వివాదాస్పదం అవుతోంది. తాజాగా ఆయనకు సంబంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ వ్యక్తిని బెదిరిస్తూ ఆయన బూతులతో రెచ్చిపోవడం వెలుగులోకి వచ్చింది. మొన్నటికి మొన్న జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా ఇలానే అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆడియో వెలుగులోకి వచ్చింది. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి ఆయనకు నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. చంద్రబాబు పిలిచి మందలించారు కూడా. అయినా కూడా ఆయన వైఖరిలో మార్పు రాలేదు.
* ఇద్దరు నేతల మధ్య పడక.. అనంతపురంలోని( Ananthapuram ) ఓ మాజీ ఎమ్మెల్యేతో ఆయనకు పడడం లేదు. ఆయన సైతం టిడిపికి చెందిన వారే. అయితే వీరిద్దరూ ఒకరినొకరు పలుచన అయ్యేలా చేసుకుంటున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ పరువు ఇక్కడ పోతోంది. ప్రతిరోజు ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. తాజాగా ఓ వ్యక్తిని ఫోన్లో ఎమ్మెల్యే బెదిరిస్తున్న ఆడియో బయటపడింది. అనంతపురంలో ఆప్టికల్స్ షాప్ నిర్వహించుకుంటున్న దంపతులు తాము మోసపోయామంటూ మీడియా ముందుకు వచ్చారు. తమ షాపునకు సంబంధించి డబుల్ రిజిస్ట్రేషన్ జరిగినట్లు వారు చెప్పుకొచ్చారు. అయితే ఎమ్మెల్యే బావమరిది అశోక్ పేరుతో నిందితులు తప్పించుకుంటున్నారని వారు చెప్పారు. దీంతో ఎమ్మెల్యే ప్రసాద్ కు కోపం వచ్చింది. ఫోన్ చేసి వారికి బండ బూతులు తిట్టారు. ఆ ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
* ఎస్పీకి ఫిర్యాదు..
అయితే అక్కడ స్పష్టమైన రాజకీయ ఆధిపత్యం కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెర్సెస్ మాజీ ఎమ్మెల్యే అన్నట్టు పరిస్థితి మారింది. ఈ చిన్న విషయం జరిగిన అది వివాదానికి దారితీస్తోంది. తాజాగా ఈ ఆడియో బయటకు రావడం వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే ప్రసాద్ అరాచకాలపై సిపిఐ ఏకంగా పోరాటానికి దిగింది. చంద్రబాబు ముఖం చూసి ప్రసాద్ ను గెలిపిస్తే.. ఆయన ఇక్కడ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని సిపిఐ నేతలు ఆరోపిస్తున్నారు. భూ కబ్జాలతో పాటు దాడులు పెరిగాయని.. ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ నేతలు ఏకంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మొత్తానికి అయితే తెలుగుదేశం పార్టీలో అనంతపురం ఎమ్మెల్యే మరింత వివాదాస్పదం అవుతున్నారు. అయితే దీనిపై టిడిపి హై కమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
