Minister Narayana Audio Leak: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటుతోంది. కూటమిలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన మరో 15 ఏళ్ల పాటు కొనసాగుతుందని నేతలు తేల్చి చెబుతున్నారు. వారు ఊహిస్తున్నట్టే అనేక రకాల సమస్యలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా మంత్రి నారాయణ సొంత పార్టీ నేతపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు లీక్ అయ్యాయి. టిడిపి నేతలను హెచ్చరించే క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జాగ్రత్తలు చెప్పే మాటలు ఆడారు. అవే ఇప్పుడు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.
టెలికాన్ఫరెన్స్ లీక్..
నెల్లూరు జిల్లాలో( Nellore district) రేషన్ బియ్యం మాఫియా కు సంబంధించి కొన్ని రకాల ఆరోపణలు వచ్చాయి. రూరల్ ఎమ్మెల్యే సోదరుడు ఏకంగా దీనిపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా, నారాయణ స్పందించారు. నెల్లూరు సిటీ టిడిపి నేతలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ క్రమంలో తాను కాకినాడ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నానని.. పవన్ కళ్యాణ్ కోసం టిడిపి నేత వర్మను జీరో చేసామని చెప్పుకొచ్చారు. ఆ నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమాలు జరపాలన్న జనసేనతో సమన్వయం చేసుకోవాలని వర్మను ఆదేశించినట్లు చెప్పారు. ఇష్టారాజ్యంగా ప్రకటనలు ఇవ్వడానికి కూడా ఆయనకు అనుమతి లేకుండా టిడిపి నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అటువంటి నేత విషయంలోనే కఠినంగా ఉంటే.. అవసరమైతే నెల్లూరు జిల్లాలో కూడా అటువంటి నిర్ణయాలే ఉంటాయని సొంత పార్టీ నేతలకు నారాయణ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ కామెంట్స్ లీక్ అయ్యాయి.
అలా తేల్చేసిన వర్మ..
మరోవైపు మంత్రి నారాయణ( Minister Narayana) వ్యాఖ్యలు బయటకు వచ్చిన క్రమంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. తనను జీరో చేశారని మంత్రి నారాయణ వ్యాఖ్యానించిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా వర్మ అసహనం వ్యక్తం చేశారు. నేను జీరో అని.. కర్మ అని.. కరివేపాకు అని రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారని.. కానీ దాని గురించి తాను మాట్లాడదలచుకోలేదని.. తాను ఎప్పటికీ టిడిపి ఫైర్ బ్రాండ్ అని.. కూటమి ఐక్యత కోసం తాను ఎప్పుడూ మౌనంగా ఉంటానని వర్మ వ్యాఖ్యనించారు. తానేంటో చంద్రబాబుతో పాటు లోకేష్ కు తెలుసు అని.. వారి పట్ల ప్రేమ ఉందని తేల్చి చెప్పారు. సందట్లో సడే మియా అన్నట్టు మాజీమంత్రి అంబటి రాంబాబు దీనిపై స్పందించారు. వర్మకు సొంత బలం ఉందని.. అదే బలంతో పవన్ గెలిచారే తప్ప.. ఆయనకంటూ ఎటువంటి ఓటు బ్యాంకు లేదని ఎద్దేవా చేశారు. వర్మ కు తెలుగుదేశం పార్టీలో అన్యాయం జరుగుతోందని విమర్శించారు. మొత్తానికైతే మంత్రి నారాయణ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.