Homeఆంధ్రప్రదేశ్‌AP Leaders : ప్రజాప్రతినిధులు ప్రజల కోణంలో పనిచేస్తే అద్భుతాలు జరుగుతాయి.. అలాంటిదే ఈ స్టోరీ...

AP Leaders : ప్రజాప్రతినిధులు ప్రజల కోణంలో పనిచేస్తే అద్భుతాలు జరుగుతాయి.. అలాంటిదే ఈ స్టోరీ కూడా..

AP Leaders : ‘‘ఒకే ఒక్కడు సినిమా మీరు చూశారా.. అందులో రేషన్ షాపులో అక్రమాలు జరుగుతున్నాయని తెలిసి.. ముఖ్యమంత్రి మారు వేషంలో వెళ్తాడు. అక్కడ జరుగుతున్న అక్రమాలను గుర్తించి రేషన్ డీలర్ పై చర్యలు తీసుకుంటాడు. అంతేకాదు వ్యవస్థలో ఉన్న ఇలాంటి లోటుపాట్లను సరి దిద్దుతాడు.’’ సహజంగానే ఇలాంటి సన్నివేశాలు ప్రతి ఒక్కరికీ నచ్చుతాయి. అలాంటి సన్నివేశాలు నచ్చేవారు ఎప్పుడో ఒకప్పుడు వ్యవస్థలో లోపం వల్ల బాధపడ్డవారే. వారు పడ్డ బాధకు పరిష్కార మార్గం దొరకడంతో ఏదో తెలియని ఆనందం పెల్లుబుకుతుంది. కానీ ఇలాంటి దృశ్యమే నిజ జీవితంలో కనిపిస్తే.. ఒకరి కాదు ఇద్దరు కాదు ఏకంగా 25 మంది జీవితాలలో కొత్త వెలుగులు ప్రసరిస్తే.. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపిస్తోందా.. మన వ్యవస్థ సక్రమంగా పనిచేసి.. మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ప్రజల కోణంలో ఆలోచించి.. నిర్ణయాలు తీసుకుంటే.. అవి గొప్ప ఫలితాలను ఇస్తాయి. అలాంటి నిర్ణయమే ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్నారు. ఫలితంగా 25 మంది జీవితాలలో సరికొత్త వెలుగులను ప్రసరించారు.

దేశవ్యాప్తంగా ఎన్ఐటీ, ఐఐటీ లలో ప్రవేశాలకు సంబంధించి ఇటీవల ఫలితాలను జాతీయ పరీక్షా మండలి ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 25 మంది దివ్యాంగులు (వారంతా వివిధ రకాల మానసిక, శారీరక వైకల్యంతో బాధపడుతున్నారు) ఎన్ఐటీ, ఐఐటీ లలో ప్రవేశాలకు అర్హత సాధించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశం పొందాలంటే కచ్చితంగా విద్యార్థులు 5 సబ్జెక్టులు చదివి ఉండాలి. అయితే ఏపీలో ని ఆ దివ్యాంగ విద్యార్థులు కేవలం నాలుగు సబ్జెక్టులు మాత్రమే చదివారు. దీనివల్ల ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సాధించినప్పటికీ.. ప్రవేశం పొందే అర్హతను కోల్పోయారు. దీంతో ఆ విద్యార్థుల్లో నైరాశ్యం అలముకుంది. అయితే ఇందులో ఒక విద్యార్థి ధైర్యం తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ కు వాట్సాప్ మేసేజ్ చేశాడు. దీంతో ఆయన వెంటనే స్పందించారు. విషయం మొత్తం తెలుసుకున్నారు.

ఆ మరుసటి రోజు తన శాఖలో పనిచేసే అధికారులతో ఈ విషయం గురించి చర్చించారు. అయితే అప్పటికే ఒక్కరోజు సమయం మాత్రమే విద్యార్థులకు ఉంది. ఎందుకంటే వారు చదివిన సర్టిఫికెట్లను ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సమర్పిస్తేనే ప్రవేశం లభిస్తుంది. దీంతో ఆగమేఘాల మీద ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అప్పటికప్పుడు వారి మెమోలను మార్చేసింది. వారు ఐదు సబ్జెక్టులు చదివినట్టుగా మెమోలు జారీ చేసింది. అంతేకాదు వారు ఏ విద్యాసంస్థల్లో అయితే ప్రవేశాలు పొందారో.. అక్కడికి మెమోలను పంపించింది. దీంతో ఆ విద్యార్థులకు ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశం లభించింది.

ఆ తర్వాత ప్రవేశాలు పొందిన విద్యార్థులతో మంత్రి నారా లోకేష్, ఇతర అధికారులతో కలిసి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థులు తమ మనోగతాన్ని వెల్లడించారు. సీట్లు సాధించిన 25 మంది విద్యార్థులు కూడా పేద, మధ్యతరగతి కుటుంబాల చెందిన వారే. ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందడంతో వారి ఆనందం మామూలుగా లేదు. కొందరైతే కన్నీటి పర్యంతమయ్యారు. మరికొందరు ప్రభుత్వానికి చేతులెత్తి నమస్కరించారు. ఇంకొందరైతే పోయిన సీట్లు మళ్లీ మాకు రావడం నమ్మలేకపోతున్నామంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

వాస్తవానికి ఇదంతా చూస్తే మామూలు సంఘటన లాగానే కనిపించవచ్చు. ఇదేం గొప్ప అద్భుతం లాగ అనిపించకపోవచ్చు. కానీ దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో కోల్పోయిన సీట్లను సాధించడం అంత సులువు కాదు. ప్రభుత్వం అప్పటికప్పుడు జీవోను జారీ చేయడం అంత సులభం కాదు. మెమోలను కొత్తవి ముద్రించి.. ఐదు సబ్జెక్టులను చదివినట్టుగా రూపొందించడం అంత సులభం కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు పెట్టుబడిదారుల విషయ కౌగిలిలో ఉన్నాయి. వారికోసం భూములు ఇవ్వగలవు. రాయితీలు ఇవ్వగలవు. జీవోలు మార్చగలవు. అవసరమైతే ప్రభుత్వ భూములను సైతం మంజూరు చేయగలవు. ఇదే సమయంలో ప్రజల కోణం వచ్చేసరికి ప్రభుత్వాలు అంత సులభంగా, అంత వేగంగా పనులు చేయలేవు. కానీ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో ప్రజల కోణంలో ప్రభుత్వం పని చేయడం వల్ల.. ప్రజల ఆకాంక్షలను గుర్తించి ముందడుగు వేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు కళ్ళ ముందు కనిపించాయి. 25 మంది విద్యార్థులకు గొప్ప గొప్ప విద్యా సంస్థల్లో ప్రవేశాలు లభించేలా చేయడం అంటే మామూలు విషయం కాదు. “ప్రజల కోణంలో పనిచేస్తే ప్రభుత్వాలు గొప్పగా నిలబడతాయి. ప్రజాస్వామ్యం అనేది అప్పుడే నిలువెత్తు దర్పణంగా కనిపిస్తుంది” అబ్రహం లింకన్ ఊరకే అనలేదు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, ఆ తరహా వార్తలను చదివినప్పుడు అబ్రహం లింకన్ మాటలు కచ్చితంగా గుర్తుకు వస్తాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేది గొప్పది కాబట్టి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular