Minister Nara Lokesh: మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh).. ప్రతికూలతల నుంచి ఎదగాలనుకునే యువ నాయకులకు ఆయన ఒక ఆదర్శం. ఎలాంటి లోకేష్.. ఎలా మారారు.. ఎంతలా మారారు అనేది ఇప్పుడు ప్రధాన చర్చ. పప్పు అన్నవారే ఇప్పుడు పప్పులో కాలేశామని బాధపడుతున్నారు. లోకేష్ విషయంలో తప్పు చేశామని పశ్చాత్తాప పడుతున్నారు. అప్పుడెప్పుడో తండ్రి చాటు బిడ్డను చూసి.. వచ్చిరాని మాటను చూసి ఏవేవో వాగేశారు. కానీ ప్రతి మాటను, ప్రతి అడ్డంకిని గుణపాఠంగా మార్చుకున్నారు లోకేష్. నిమిషానికి నిమిషానికి.. ప్రతి గంటకు.. ప్రతి రోజుకు.. ప్రతి నెలకు.. ప్రతి ఏడాదికి తనలో ఉన్న పరిణితిని పెంచుకున్నారు లోకేష్. ఎవరైతే ఎగతాళి చేశారో? ఎవరైతే తక్కువ చేసి మాట్లాడారో? వారందరికీ తన పనితీరు ద్వారా సమాధానం చెప్పారు. తన విషయంలో దూకుడు ప్రదర్శించిన వారికి రెడ్ బుక్ పనితనం చూపించారు. అదే సమయంలో రాజకీయ పరిణితి పెంచుకున్నారు. ఎలా అయితే ప్రజల్లోకి వెళ్ళగలమో ఆలోచన చేసి అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. చేసిందే చెబుతున్నారు. అనవసర వ్యాఖ్యలకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా ప్రజల అభిమానాన్ని పొందే మంచి పనులను ఎంచుకుంటున్నారు. రాజకీయ ప్రత్యర్థుల అంచనాలకు అందకుండా రాజకీయాలు చేస్తున్నారు.
* ఎటువంటి ఆర్భాటం లేకుండా..
మొన్న ఆ మధ్యన దావోస్( davos ) పర్యటనకు వెళ్లారు. సీఎం చంద్రబాబు తో పాటు ఇతర మంత్రులు, అధికారుల బృందం సైతం వచ్చింది. లోకేష్ చాలామంది ఐటీ దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యారు. కానీ అదిగో పెట్టుబడులు.. ఇదిగో పెట్టుబడులు అంటూ మాత్రం ప్రకటనలు చేయలేదు. అంతకుముందే లండన్ పర్యటనకు వెళ్లారు. ప్రముఖ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. అవన్నీ సానుకూలం అని చెప్పారే కానీ.. ప్రచార ఆర్భాటం చేయలేదు. కొద్ది రోజుల కిందట సింగపూర్ వెళ్లారు. అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యారు. తాము ఎందుకు వెళ్ళామో చెప్పారు కానీ.. ఇక్కడ కూడా ఎటువంటి ఆర్భాటం చేయలేదు. అయితే ప్రతిరోజు ఏదో ఒక పరిశ్రమ, సంస్థ ఏపీలో తాము పెట్టుబడులు పెడుతున్నామని చెబుతోంది. ప్రకటనలు చేస్తోంది. అలా చేస్తున్న సంస్థల ప్రతినిధులు లోకేష్ చర్చలు జరిపిన వారే. అయితే వారంతట వారు ఇప్పుడు లోకేష్ పేరు చెబుతున్నారు. ప్రజలు కూడా లోకేష్ పని తీరును మెచ్చుకుంటున్నారు.
* అనుకున్న పని అలవోకగా
మొన్న ఆ మధ్యన ఢిల్లీ వెళ్లారు నారా లోకేష్. ప్రధాని నరేంద్ర మోడీతో( Prime Minister Narendra Modi) సమావేశం అయ్యారు. గంట పాటు వారి సమావేశం జరిగింది. తాను ఢిల్లీ ఎందుకు వెళ్లానో లోకేష్ మీడియాకు వివరించారు కూడా. అంతకుముందు మే నెలలో కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో డిన్నర్ భేటీ చేశారు. అయితే ఇలా ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తున్న క్రమంలో ఎటువంటి హడావిడి చేయడం లేదు. కేవలం తన పని తాను చేసుకుని ముందుకు సాగుతున్నారు. అయితే ఒక్కటి మాత్రం నిజం తెలుగుదేశం పార్టీని ఒంటి చేత్తో నడపగలుగుతున్నారు. ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. కూటమి సమన్వయం లోనూ ఆయన పాత్ర కీలకం. ఇంకోవైపు రాష్ట్రానికి పెట్టుబడులు తేవడంలో కూడా కీ రోల్ ప్లే చేస్తున్నారు. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండవచ్చని చేసి చూపిస్తున్నారు. తాజాగా నేపాల్ లో చిక్కుకున్న ఏపీ ప్రజలను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురాగలిగారు. కూటమికి కీలకమైన అనంతపురం సక్సెస్ సభకు సైతం దూరంగా ఉన్నారు. సచివాలయంలో ఉంటూ.. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ.. లోకేష్ అనుసరించిన వైఖరి ఆకట్టుకుంటోంది. మొత్తానికైతే నేటి ట్రెండ్ కు తగ్గట్టు లోకేష్ రాజకీయం ఉంది. విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.