Minister Nadendla Manohar : ఏపీలో తెనాలి కీలక నియోజకవర్గం. రాజకీయ చైతన్యం కూడా ఎక్కువే. అయితే ఎన్నికల్లో విచిత్ర పరిస్థితులు ఎదురయ్యాయి.అక్కడ పోటీ చేసేందుకు మాజీ మంత్రులు ఆలపాటి రాజా, నాదెండ్ల మనోహర్ లు పోటీపడ్డారు. ఇద్దరు కూడా సీనియర్ నేతలే. నియోజకవర్గంపై పట్టున్న నాయకులే. గతంలో ప్రాతినిధ్యం వహించిన వారే. ఆలపాటి రాజా టిడిపి నుంచి,నాదేండ్ల మనోహర్ జనసేన నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే టిడిపి, జనసేన కూటమి కట్టిన నేపథ్యంలో రెండు నాయకత్వాలకు ఈ నియోజకవర్గం తలనొప్పిగా మారింది. టికెట్ మా పార్టీ కంటే మా పార్టీకేనని.. రెండు పార్టీల మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. అయితే రాష్ట్రస్థాయిలో నాదెండ్ల మనోహర్ జనసేన లో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో ఆయనకే టికెట్ ఇవ్వాలని పవన్ నుంచి చంద్రబాబుకు ఒత్తిడి ఎదురయ్యింది. దీంతో చంద్రబాబు ఆలపాటి రాజాకు సర్ది చెప్పాల్సి వచ్చింది. భవిష్యత్తులో మంచి అవకాశం కల్పిస్తానని హామీ ఇవ్వడంతో ఆలపాటి రాజా పక్కకు తప్పుకున్నారు. ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన నాదెండ్ల మనోహర్ కు మద్దతుగా నిలిచారు. ఆయన విజయానికి కృషి చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాదెండ్ల మనోహర్ మంత్రి కూడా అయ్యారు.
* ఎమ్మెల్సీ అభ్యర్థిగా
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆలపాటి రాజాకు అరుదైన ఛాన్స్ దక్కింది.కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా చంద్రబాబు ఆయనను ఎంపిక చేశారు. గెలుపు బాధ్యతను నాదెండ్ల మనోహర్ పై పెట్టారు. మూడు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఆలపాటి రాజా గెలుపు సునాయాసం అని చెప్పవచ్చు. అయితే మూడు పార్టీల మధ్య సమన్వయం కుదిరితేనే అది సాధ్యమవుతుంది. అందుకే ఆ సమన్వయ బాధ్యతలను నాదెండ్ల మనోహర్ పై పెట్టారు చంద్రబాబు. ఇప్పుడు ఆలపాటి రాజా కోసం రంగంలోకి దిగారు నాదెండ్ల మనోహర్.
* తొలి ఓటు ఆయనకే
తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలపై మాట్లాడారు నాదెండ్ల మనోహర్.ఆలపాటి రాజాను గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.జనసేన తరఫున గట్టిగానే పోరాడుతానని కూడా తేల్చి చెప్పారు.ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తానని.. తొలి ఓటు తానే వేస్తానని చెప్పుకొచ్చారు మనోహర్. గతంలో ఇద్దరి మధ్య రాజకీయ వైరం ఉండేది. మొన్నటి ఎన్నికల్లో టికెట్ లొల్లి నడిచింది. అయినా సరే ఇప్పుడు ఇద్దరు నేతలు పరస్పరం అవగాహనతో ముందుకు సాగుతున్నారు. ఒకరి విజయానికి ఒకరు పాటుపడుతున్నారు. మరి నాదెండ్ల మనోహర్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.