Muttamshetty Srinivasa Rao : వైసీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత నేతలు గుడ్ బై చెబుతున్నారు. పదుల సంఖ్యలో నేతలు పార్టీకి దూరమయ్యారు. అందులో తాజా మాజీ మంత్రులు ఎక్కువగా ఉన్నారు. ఇటీవల మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆమె బాటలో మరికొందరు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు ఇద్దరు పార్టీని వీడుతారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. అయితే పదవులుఉన్నవారు సైతం పార్టీని వీడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, కృష్ణయ్యలు రాజీనామా చేశారు. మరో నలుగురు ఎమ్మెల్సీలు సైతం పదవులు వదులుకున్నారు. అయితే రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలను వ్యూహాత్మకంగా తగ్గించుకునేందుకు అధికార పార్టీ వారితో రాజీనామా చేయించిందని తెలుస్తోంది. మరోవైపు తాజా మాజీ మంత్రులు సైతం పార్టీ నుంచి బయటికి వస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మేకతోటి సుచరిత, విడదల రజిని పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.ఈ ముగ్గురు పార్టీ కార్యకలాపాలకు సైతం దూరంగా ఉన్నారు. హై కమాండ్ తీరుపై ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. కూటమి పార్టీలకు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
* పిఆర్పి ద్వారా ఎంట్రీ
ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ముత్తంశెట్టి శ్రీనివాసరావు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. పిఆర్పి కాంగ్రెస్లో విలీనం కావడంతో ఆ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల నాటికి టీడీపీ గూటిలోకి వచ్చారు. అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచిన ఆయనకు మంత్రి పదవి వరించింది. మూడేళ్ల పాటు జగన్ క్యాబినెట్లో పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా కొనసాగారు. విస్తరణలో మాత్రం శ్రీనివాసుని తప్పించి గుడివాడ అమర్నాథ్ కు ఛాన్స్ ఇచ్చారు జగన్.ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.గంటా శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు.ఏకంగా 92 వేల ఓట్లతో ఓడిపోవడం విశేషం.
* విజయసాయిరెడ్డి తో విభేదాలు
అయితే తాజాగా ఉత్తరాంధ్ర సమన్వయకర్తగావిజయసాయిరెడ్డిని జగన్ నియమించిన సంగతి తెలిసిందే.అయితే గతంలో మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాస్ ఎటువంటి అధికారాలు చలాయించలేదు. దీనికి విజయసాయిరెడ్డి వైఖరి కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు తిరిగి అదే విజయసాయిరెడ్డిని సమన్వయకర్తగా నియమించడంపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అందుకే పార్టీలో ఉండడం కంటే బయటకు వెళ్లిపోవడమే మేలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే టిడిపిలో చేరాలా? జనసేనలోకి వెళ్లాలా? అని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.