Minister Kottu Satyanarayana: జగన్ క్యాబినెట్లో ఒక మంత్రికి షాక్ తప్పదా? ఆయనకు టికెట్ లేదని తేల్చనున్నారా? ప్రత్యామ్నాయంగా మరో నాయకుడికి టికెట్ ఇవ్వనున్నారా? వైసిపి వర్గాల్లో ఇప్పుడు ఇదే ప్రచారం జరుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మంత్రి కొట్టు సత్యనారాయణకు ఈసారి టిక్కెట్ లేదని తెలుస్తోంది. సర్వేలో ఆయన వెనకబడడంతో ఆయన స్థానంలో ఈలి నానిని అభ్యర్థిగా నిలబెడతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జగన్ క్యాబినెట్లో పనిచేసిన గుమ్మనూరు జయరాం కు టికెట్ నిరాకరించారు. దీంతో ఆయన పార్టీని వీడారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో కొట్టు సత్యనారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
గత ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నుంచి కొట్టు సత్యనారాయణ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. టిడిపి అభ్యర్థిగా బరిలో దిగిన ఈలి నాని పై గెలుపొందారు. మొన్నటికి మొన్న మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి దక్కించుకున్నారు. జగన్ ఆయనకు దేవాదాయ శాఖను అప్పగించారు. అయితే తాజా ఎన్నికల్లో కొట్టు సత్యనారాయణ గ్రాఫ్ బాగోలేదని తేలింది. దీంతో తాడేపల్లిగూడెం టిడిపి టికెట్ ఆశించిన ఈలి నానిని వైసీపీలోకి రప్పించారు. కొట్టు సత్యనారాయణ ను పక్కకు తప్పించి ఆయన స్థానంలో నానికి అవకాశం ఇవ్వనున్నారు. మూడు రోజుల కిందట ఈలి నాని వైసీపీలో చేరారు.
2009లో ప్రజారాజ్యం పార్టీ 18 మంది ఎమ్మెల్యేల్లో ఈలి నాని ఒకరు. ఆ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నుంచి పి ఆర్ పి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2014లో టిడిపిలో చేరారు. గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ కొట్టు సత్యనారాయణ చేతిలో ఓడిపోయారు. గత ఐదు సంవత్సరాలుగా టిడిపిలో కొనసాగుతూ వచ్చారు.ఇప్పుడు పొత్తులో భాగంగా తాడేపల్లిగూడెం సీటును బిజెపికి కేటాయించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఈలినాని వైసీపీలోకి వచ్చారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. మంత్రి కొట్టు సత్యనారాయణ దీనిని అవమానంగా భావిస్తున్నారు. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.