Sandeep Reddy Vanga : టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యాడు సందీప్ రెడ్డి వంగ. మొదటి సినిమాతోనే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సెన్సేషన్ క్రియేట్ చేసాడు.తొలి సినిమాతోనే సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటివరకు తెలుగులో ‘అర్జున్ రెడ్డి’వంటి ఒక మూవీ రాలేదు.అందుకే ఈ సినిమా రిలీజ్ సమయంలో అనేక కాంట్రవర్సీలు జరిగాయి. అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తమ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగా గట్టిగా నిలబడ్డాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. విజయ్ దేవరకొండ కెరీర్ ని ఒక మలుపు తిప్పింది అర్జున్ రెడ్డి. తనను స్టార్ హీరోగా ప్రేక్షకుల ముందు నిలబెట్టింది.
2017లో భద్రకాళి పిక్చర్స్ పతాకంపై అర్జున్ రెడ్డి సినిమాను నిర్మించారు. ఇందులో విజయ్ దేవరకొండ సరసన షాలిని పాండే హీరోయిన్ గా నటించింది. రాహుల్ రామకృష్ణ, జియా శర్మ, సంజయ్ స్వరూప్, గోపినాథ్ భట్, కమల్ కామరాజు, కాంచన కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అర్జున్ రెడ్డి దేష్ముఖ్ అనే కోపాన్ని అదుపులో ఉంచుకోలేని తాగుబోతు వైద్యుడు గురుంచి. తన ప్రేయసిని కోల్పోయిన తరువాత అర్జున్ తీసుకునే విధ్వంసక చర్యలు, వాటి మూలంగా జరిగే ఘటనలు ఈ కథ. ఈ సినిమాలో అర్జున్ పాత్రలో విజయ్ దేవరకొండ అద్భుతంగా, చాలా న్యాచురల్ గా నటించారు.
2017 ఆగస్టు 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. విజయ్ దేవరకొండ, సందీప్ వంగా కెరీర్ మలుపుతిప్పిన సినిమాగా నిలిచింది. కెరీర్ పరంగా వారి ఎదుగుదలకు ఈ సినిమా సక్సెస్ బాగా ఉపయోగపడింది. ఈ సినిమా ఒరిజినల్ రన్ టైమ్ దాదాపు 3.45 గంటలు. పలు కారణాల రీత్యా 3.02 గంటల నిడివితో దీనిని విడుదల చేశారు. అభ్యంతరకర పదాలు, ముద్దు సన్నివేశాల కారణంగా నిడివిని తగ్గించాలని సెన్సార్ బోర్డు పేర్కొంది. రూ.5 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం దాదాపు రూ.50 కోట్లు వసూలు చేసింది. తెలుగులో సూపర్‌హిట్ అందుకున్న ఈ చిత్రాన్ని తమిళంలో ‘ఆదిత్య వర్మ’ , హిందీలో ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేశారు.
ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో సందీప్ రెడ్డి వంగా కూడా నటించారట. ఈ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆయన మూవీలో ఒకే ఒక్క షాట్లో కనిపిస్తారు. అర్జున్ రెడ్డి పై చదువుల నిమిత్తం వేరే స్టేట్ కు వెళ్లినప్పుడు ప్రీతి చూడడానికి వస్తుంది. అప్పుడు ప్రీతి వచ్చిందని చెప్పేది సందీప్ రెడ్డి వంగానే. వాస్తవానికి మూవీలో సందీప్ రెడ్డి వంగ సీనియర్ రోల్ చేయాలి. కానీ ఆ క్యారెక్టర్ స్పాయిల్ చేయడం ఇష్టం లేక వాళ్ల సీనియర్ తోనే ఈ రోల్ చేయించారట.
