AP Rains : ఏపీకి భారీ వర్ష సూచన. దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో..శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రెండు రోజుల్లో అది వాయుగుండంగా బలపడునుంది.దీని ప్రభావంతో మంగళ,బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. అల్పపీడనం తుఫాన్ గా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. అనంతరం తీవ్ర వాయుగుండం గా బలహీనపడి.. ఈనెల 27 నాటికి తమిళనాడు లేదా ఏపీలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కూర్మనాధ్ హెచ్చరించారు. వ్యవసాయ పనులు జరుగుతున్న దృష్ట్యా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
* సర్కార్ అప్రమత్తం
మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తం అయ్యింది.ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో వెంటనే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు. కొన్ని జిల్లాల్లో ప్రస్తుతం వరి కోతలు జరుగుతున్నాయి. అటువంటి చోట్ల వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది ఏపీ సర్కార్. విపత్కర పరిస్థితులను రైతులు ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని ఆదేశించింది.
* రైతుల్లో ఆందోళన
మరోవైపు అటు రాయలసీమకు సైతం వర్ష సూచన ఉంది.అయితే తుఫాన్ అంటేనే రైతులు భయపడుతున్నారు. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరికొన్ని జిల్లాల్లో రబీ పనులు ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో వర్ష హెచ్చరిక రావడంతో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. అయితే ఎటువంటి విపత్కర పరిస్థితులునైనా ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాల సిద్ధంగా ఉంది.