AP Rains: ఏపీకి మరోసారి వర్ష సూచన. బంగాళాఖాతం నుంచి భారీ హెచ్చరిక వచ్చింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం 26న లేదా 27 నాటికి శ్రీలంక ఉత్తర దిశగా వస్తుందని అధికారులు భావిస్తున్నారు. దీని ప్రభావంతో ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తా లోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పు గాలులు ప్రభావంతో రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడ వర్షాలు పడనున్నాయి.రాగల 24 గంటల్లో రాయలసీమలో పలుచోట్ల, దక్షిణ కోస్తాలో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో మాత్రం పొడి వాతావరణం కొనసాగనుంది. అయితే ఈ అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
* ఒక్కసారిగా పెరిగిన చలి
మరోవైపు చలి తీవ్రత పెరిగింది. భారీగా మంచు కురుస్తోంది. చలి ఒక్కసారిగా పెరగడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారు.మరోవైపు తెలంగాణలో పొడి వాతావరణం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో 18 డిగ్రీలకు దిగువున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. సాయంత్రం ఐదు గంటల నుంచి విపరీతమైన మంచు కురుస్తోంది. ఉదయం 8 గంటల వరకు కొనసాగుతోంది.
* పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
దేశవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. తూర్పు,పశ్చిమ, వాయువ్య, మధ్య భారత దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ కు తగ్గే అవకాశం ఉందని అధికారుల అంచనా. ఈనెల 17 నుంచి 19 వరకు పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయలోని వివిధ ప్రాంతాల్లో పొగ మంచు విపరీతంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. ఆయా రాష్ట్రాలను అలర్ట్ చేస్తోంది.