SC Classification: ఏపీలో ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పావులు కదుపుతోంది. వీలైనంత త్వరగా ఎస్సీ వర్గీకరణ చేయాలని భావిస్తోంది. అయితే వర్గీకరణను మాలలు వ్యతిరేకిస్తున్నారు. వర్గీకరణ లేకపోవడంతోనే మాలలు సింహభాగం ప్రయోజనాలు పొందుతున్నారని మిగతా వర్గాలు భావిస్తున్నాయి. ఎస్సీల్లో అందరూ సమానమైన హక్కులు, రిజర్వేషన్ల ఫలాలు పొందాలన్నది ఎస్సీ వర్గీకరణ ముఖ్య ఉద్దేశ్యం. ఉమ్మడి ఏపీలోనే ఈ రిజర్వేషన్ పోరాటం పురుడు పోసుకుంది. 1994 లో ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే చిన్న గ్రామంలో మాదిగ దండోరా తో వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైంది. సమానత్వం కావాలి. దళితుల్లో వెనుకబడిన ఉపక్లాలకు న్యాయం జరగాలన్న డిమాండ్ తో ఈ ఉద్యమం మొదలైంది. మూడు దశాబ్దాల పాటు ఈ ఉద్యమం కొనసాగింది. ఎస్సీ వర్గీకరణకు ఉన్న న్యాయమైన, సాంకేతిక పరమైన, చట్టపరమైన చిక్కులన్నీ అధిగమించింది. అయితే ఈ వర్గీకరణ ఉద్యమాన్ని అణచి వేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేశాయి. ఈ విషయంలో ఏపీలో జగన్, తెలంగాణలో కెసిఆర్ ఎద్దేవా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ అనేది చట్టపరంగా నిలబడదని జగన్ అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యానాలు చేశారు.
* ఆది నుంచి సానుకూలమే
ఆది నుంచి ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు సానుకూలంగా ఉన్నారు. ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరి ఎస్సీ వర్గీకరణను అమలు చేశారు. అలా చేసిన పుణ్యమా అని ఎస్సీల్లో మాలలు కాకుండా ఇతర వర్గాలు కొన్ని ఉద్యోగాలు పొందారు. ఎస్సీలను ఏబిసిడి వర్గాలుగా విభజించి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అందరికీ అమలు చేశారు. నాలుగేళ్లలో మాదిగలు సహా ఇతర అట్టడుగు వర్గాలకు చాలా మేలు జరిగింది. ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేతలు. చంద్రబాబు అమలు చేసిన ఎస్సీ వర్గీకరణను ఎద్దేవా చేశారు వైసీపీ అధినేత జగన్. దాని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయి. ఏపీలో మాల సామాజిక వర్గం అధికం. వైసీపీకి వెన్నుదన్నుగా నిలుస్తోంది ఆ సామాజిక వర్గం. అందుకే వారి కోసమే వర్గీకరణను వ్యతిరేకించారు జగన్.
* గతంలోనూ అంతే
అయితే వర్గీకరణతో తెలుగుదేశం పార్టీకి మాలలు దూరం అవుతారు అన్నది ఒక విశ్లేషణ. వాస్తవానికి తెలుగుదేశం పార్టీని ఎన్నడూ మాలలు ఆదరించలేదు. 1983 ఎన్నికల నుంచి ఎస్సీలు టిడిపిని ఆదరించిన దాఖలాలు లేవు. కానీ ఏపీతో పోల్చితే తెలంగాణలో మాదిగల సంఖ్య అధికం. కనీసం మాదిగలనైనా తన వైపు తిప్పుకోవాలని చంద్రబాబు భావించారు. అందుకే ఎస్సీ వర్గీకరణకు జై కొట్టారు. అమలు చేసి చూపించారు. దీంతో మాదిగలు యూటర్న్ తీసుకున్నారు. ఒక్క మాలలకు మినహాయించి మిగతా వర్గాలు టిడిపిని ఆదరించడం ప్రారంభించారు. అయితే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు ముందడుగు వేయడంతో మాలలు దూరం అవుతారని టాక్ ప్రారంభమైంది. కానీ చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజాప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో మాలలు సైతం టిడిపి కూటమిని ఆదరించారు. ప్రభుత్వ వైఫల్యాలు ఎదురైనప్పుడు ఏ కులం కూడా హర్షించదని మొన్నటి ఎన్నికల్లో రుజువయ్యింది. ఇప్పటికే మాలలు తెలుగుదేశం పార్టీకి ఎన్నడూ దూరమయ్యారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన నష్టం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.