AP Rain Alert : ఏపీకి మరోసారి వర్ష సూచన. బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. కొద్దిరోజుల కిందటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీతో సహా తమిళనాడు,కర్ణాటకలో విస్తారంగా వర్షాలు. ఏపీకి సంబంధించి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు అయ్యాయి. యానాంతోపాటు ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో సైతం వర్షాలు పడ్డాయి. అయితే మరోసారి అటువంటి పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. గురువారం నాటికి బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడబోతోంది. అండమాన్ నికోబార్ దీవులకు దక్షిణ దిశ, దాని పరిసర ప్రాంతాల్లో గగనతలంపై సుమారు రెండు కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం ఏర్పడడానికి అనుకూల వాతావరణం ఉందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
* అల్పపీడనంగా మారితే
ఈ ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారితే మాత్రం ఈనెల 27 నుంచి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని అంచనా వేస్తున్నారు. అల్పపీడనంగా మారిన అనంతరం నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం గా బలపడుతుందని పేర్కొంది.దీని ప్రభావంతో ఈనెల 27, 28 తేదీల్లోనే ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏపీతోపాటు తమిళనాడు ఉత్తర ప్రాంత జిల్లాల్లో అంచనాలకు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.
* ఈ రెండు నెలలు అంతే
నవంబరు,డిసెంబరు వచ్చేసరికి బంగాళాఖాతంలో వాయు గుండాలు ఏర్పడడం సర్వసాధారణం. బంగాళాఖాతం నుంచి ఏమాత్రం హెచ్చరిక వచ్చినా తీర ప్రాంత ప్రజలు చిగురుటాకులా వణికి పోతారు. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో వర్షం హెచ్చరికలు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.