AP Rains : బంగాళాఖాతం నుంచి ఏపీకి భారీ హెచ్చరిక వచ్చింది. రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం అల్పపీడనంగా మారింది. ఉత్తర తమిళనాడు తో పాటు దక్షిణ కోస్తాపై ప్రభావం చూపనుంది. దీని ప్రభావంతో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రధానంగా దక్షిణ కోస్తా ప్రాంతాలపై విపరీతమైన ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని ప్రభావంతో ఈరోజు బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.అలాగే గుంటూరు, అనంతపురం, శ్రీ సత్య సాయి, కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ యండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ప్రస్తుతం వరి కోతలు జరుగుతున్న దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో సంరక్షించాలని సూచించారు.
* ఏపీ పై అప్పుడే ప్రభావం
అల్పపీడన ప్రభావం ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా దక్షిణ కోస్తాలో వాతావరణంలో మార్పు కనిపించింది. ప్రకాశం జిల్లాలో మంగళవారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అక్కడక్కడ వర్షాలు కూడా పడ్డాయి. తూర్పు ప్రాంతంలో ఒక మోస్తరు వాన పడింది. జరుగుమల్లి మండలంలో 16.4 మిల్లీమీటర్లు, కొత్తపట్నంలో పది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఒంగోలు, కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో సైతం వర్షం పడింది. మరో రెండు రోజులపాటు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
* రైతుల్లో ఆందోళన
ఖరీఫ్ లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. కల్లాలో ధాన్యం నిల్వలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో వాతావరణం లో ఒక్కసారిగా మార్పులు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు కురిస్తే నష్టం తప్పదని భావిస్తున్నారు. ఇక కోత కోయని వరిచేలు సైతం ఈదురు గాలులకు నేలకొరుగుతున్నాయి. దీంతో నష్టం తప్పదని రైతులు ఆందోళనతో ఉన్నారు. తుఫాన్ ముప్పు తప్పాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.