Homeఆంధ్రప్రదేశ్‌Mentha Cyclone: ఇందుకే జర్నలిస్టులను ట్రోల్ చేసేది.. కొంచెం మారండ్రా బాబూ

Mentha Cyclone: ఇందుకే జర్నలిస్టులను ట్రోల్ చేసేది.. కొంచెం మారండ్రా బాబూ

Mentha Cyclone: ఒక వంతెన నిర్మించాలంటే ఇంజనీర్ కావాలి. ఇంజనీర్ వంతెనకు ప్లాన్ ఇవ్వాలంటే అతడు ఇంజనీరింగ్ చదివి ఉండాలి. అలాగే ఒక రోగికి వ్యాధి నయం కావాలంటే వైద్యుడు మందులు సూచించాలి. అలా జరగాలంటే అతడు వైద్య విద్య అభ్యసించాలి. ఇలా సమాజంలో అన్ని వృత్తులకు తగ్గట్టుగానే క్వాలిఫికేషన్లు ఉన్నాయి. అందులో నైపుణ్యం సాధించిన వారు మాత్రమే ఆ పని చేయాలి.. దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో ప్రతి ఓడు జర్నలిస్ట్ అయిపోతున్నాడు. యూట్యూబ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయిన తర్వాత.. ప్రతి ఒక్కడు అర్ణబ్ గోస్వామి మాదిరిగా ఫీల్ అవుతున్నారు. తమను తాము కరణ్ థాపర్ లాగా ఊహించుకుంటున్నారు. కానీ కనీసం ఓనమాలు తెలియని వారు జర్నలిజంలోకి వస్తున్న నేపథ్యంలో ఆ వృత్తికి ఉన్న విలువ పడిపోతోంది.

జర్నలిజానికి పడిపోతున్న విలువ గురించి ఇటీవల కాలంలో అనేక వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అందువల్లే పాత్రికేయులను ఎవరూ పట్టించుకోవడం లేదు. పైగా చీడపురుగుల మాదిరిగా చూస్తున్నారు. ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే అన్ని వర్గాలు భయపడేవి. విపరీతమైన గౌరవం ఇచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కనీసం ఒక మనిషిగా కూడా జర్నలిస్టులను చూసే పరిస్థితి లేకుండా పోయింది. ఇది ఎక్కడదాకా దారితీస్తుంది.. ఎంతవరకు పతనమవుతుంది అనే విషయాలను పక్కన పెడితే.. ప్రస్తుతానికి అయితే పరిస్థితి బాగోలేదు.. ఇకపై బాగుపడుతుందని నమ్మకం కూడా లేదు.

వాస్తవానికి పాత్రికేయులు అనేవారు విషయపరిజ్ఞానంతో వెలుగులోకి రావాలి. ఈ విషయ పరిజ్ఞానం జర్నలిజం చదివితేనే వస్తుంది. అంటే తప్ప వాగాడంబరంతో రాదు. గొట్టం చేతిలో పట్టుకున్నంత మాత్రాన.. google వాయిస్ కమాండ్ తో ఇష్టం వచ్చింది టైప్ చేసినంత మాత్రాన జర్నలిస్ట్ అయిపోరు. జర్నలిజం అనేది ఒక తపస్సు. జర్నలిస్ట్ అనేవాడు నిత్య విద్యార్థిగా ఉండాలి. కచ్చితంగా నేర్చుకుంటూనే ఉండాలి. అలాంటప్పుడే ఒక పాత్రికేయుడిగా రాణించగలడు. సమాజాన్ని సరైన దారిలో పెట్టగలడు. అన్యాయాన్ని ప్రశ్నించగలడు. అక్రమాన్ని నిలదీయ గలడు. సమాజానికి ఒక టార్చ్ బేరర్ మాదిరిగా ఉండగలడు.

నేటి కాలంలో పాత్రికేయులు అలా లేరు. పాత్రికేయం తెలిసినవారు అంజనం వేసి చూసినా కనిపించడం లేదు. అందువల్లే పాత్రికేయమనేది నవ్వులాటగా మారిపోయింది. దానిని బలపరిచే సంఘటన ఒకటి జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో విపరీతంగా కనిపిస్తోంది. ఏపీలో ప్రస్తుతం తుఫాన్ ఏర్పడింది. విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. అడుగు బయట పెట్టే పరిస్థితి లేదు. ఈ క్రమంలో ఏపీలో ఏర్పడిన తుఫాన్ విలయం గురించి వివరించడానికి ఓ పాత్రికేయుడు ముందుకు వచ్చారు. ఈ విషయంలో అతడిని అభినందించాలి. తుఫాన్ తీవ్రత గురించి వివరించే క్రమంలో అతడు అడ్డగోలుగా వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టాడు. వాస్తవ పరిస్థితిని పక్కనపెట్టి సొంత భాష్యాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. అతడు చెప్పే విషయంలో స్పష్టత లేకపోవడం.. ఇష్టానుసారంగా మాట్లాడటంతో విషయం మొత్తం పక్కదారి పట్టింది. దీంతో అతడిని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇలా అడ్డగోలుగా వాగితేనే పాత్రికేయులకు ఉన్న కాస్త విలువ పోతుందని చురకలు అంటిస్తున్నారు .

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular