Cyclone Montha: మొంథా తుఫాన్( monta cyclone ) తీరం దాటింది. పెద్దగా ప్రమాదం సంభవించకుండా తీరం దాటడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గత కొద్దిరోజులుగా ఈ భారీ తుఫాన్ హెచ్చరికలతో ఏపీ వణికిపోయింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీరం దాటింది. మచిలీపట్నం- కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నరసాపురానికి దగ్గరలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ చెబుతోంది. అయితే దీని ప్రభావంతో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదవుతాయని మాత్రం హెచ్చరిస్తోంది. ఈ తుఫాను తీరం దాటి తెలంగాణ మీదుగా చత్తీస్గడ్ కు చేరుకొని.. అక్కడ బలహీనపడే అవకాశం ఉందని చెబుతోంది.
Also Read: హత్యకు కుట్ర జరిగినా.. మోడీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు.. ఈ విషయం ఎలా బయటపడింది?
* విస్తారంగా వర్షాలు..
తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం( Srikakulam ) నుంచి నెల్లూరు వరకు వర్షాలు దంచి కొడుతున్నాయి. గడిచిన 12 గంటల్లో నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఉలవలపాడులో 17 సెంటీమీటర్లు, చీరాలలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. బుధవారం సైతం కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు విశాఖలో భారీ వర్షాలు కురిసాయి. నదులు చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గ్రామాలను వరదలు ముంచెత్తడంతో వేలమంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. విశాఖ తో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో భీకర గాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం అయ్యాయి. చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో విద్యుత్ శాఖ అధికారులు బిజీగా ఉన్నారు.
* పంటలకు అపార నష్టం..
రాష్ట్రవ్యాప్తంగా 43 మండలాలపై తుఫాను ప్రభావం ఉంది. 1204 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 75 వేల మందికి పైగా అక్కడకు తరలించారు. ఆహారంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించారు. 4.4 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, దసరా సహా ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక నివేదికలు తయారు చేశారు. ప్రకాశం జిల్లాలో వర్షపాతం అధికంగా నమోదయింది. జనజీవనం స్తంభించింది. శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపి లేని వాన కురుస్తోంది. విశాఖ నగరంలో కుండపోత వర్షం పడుతోంది. మరోవైపు సముద్రంలో అలజడి నెలకొంది. శుక్రవారం వరకు మత్స్యకారులు చేపలు వేటకు వెళ్లకూడదని ప్రభుత్వం ఆదేశించింది. ఇక జలాశయాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మరో 24 గంటలపాటు వర్ష తీవ్రత ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే తుఫాను బలహీన పడనుండడంతో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.