Shock to YSRCP: ఏపీలో( Andhra Pradesh) వచ్చే ఏడాది కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున నేతలు గుడ్ బై చెబుతారని ప్రచారం నడుస్తోంది. 2024 ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతోంది. కానీ క్షేత్రస్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే పరిస్థితి లేదు. పైగా రోజురోజుకు ఆ పార్టీ బలహీనపడుతోంది. ఆ పార్టీకి చెందిన నేతలు యాక్టివ్ కావడం లేదు. కేసులతో పాటు అరెస్టులకు భయపడి ఎక్కువగా నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పట్టువదలని విక్రమార్కుడిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయన క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యకు రావడం లేదన్న విమర్శ ఉంది. గత ఎన్నికల్లో ఎదురైన పరిణామాలను గుణపాఠాలుగా మార్చుకో లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఆయన వెన్నంటి నడిచిన చాలా కుటుంబాలు ఇప్పుడు బయటకు వెళ్లిపోయేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
సీనియర్ నేత కుటుంబం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి 2024 ఎన్నికల వరకు చాలా కుటుంబాలు ఆయన వెంట నడిచాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ నలుగురికి తప్ప తన వెంట నడిచిన వారికి గుర్తింపు ఇవ్వలేదు. అటువంటి వారిలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఒకరు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకులు. ఆయనపై ఉన్న అభిమానంతో జగన్మోహన్ రెడ్డి వెంట రాజకీయంగా అడుగులు వేశారు. అయితే ఆయన సీనియారిటీని, సిన్సియారిటీని జగన్ గౌరవించలేదు. ఆయన సలహాలు సూచనలను సైతం పాటించడం లేదు. అందుకే మేకపాటి రాజమోహన్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేందుకు ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజమోహన్ రెడ్డి కుమారుడు గౌతమ్ రెడ్డి మంత్రిగా ఉండేవారు. గౌతమ్ రెడ్డి అకాల మరణంతో మరో కుమారుడు విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో తండ్రీ కొడుకులు ఇద్దరు పోటీ చేశారు. ఇద్దరికీ ఓటమి తప్పలేదు. అయితే కోటరీ మాటలు వింటున్నారని.. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదని జగన్మోహన్ రెడ్డి పై ఇటీవల ఆరోపణలు చేశారు రాజమోహన్ రెడ్డి. ఆయన ఒక నిర్ణయానికి వచ్చి ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం సాగుతోంది.
అసంతృప్తిలో ఆళ్ల ఫ్యామిలీ..
మరోవైపు అళ్ల ఫ్యామిలీ సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోం ది. రామ్ కి గ్రూపుల సమస్త అధినేత అయిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు. ఆయన సోదరుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి తో సహా వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి గెలిచారు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి. అదే సమయంలో ఆయన సోదరుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే అన్న అయోధ్య రామిరెడ్డి ఓడిపోయారు. తమ్ముడు రామకృష్ణారెడ్డి గెలిచారు. 2019 ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డికి మాత్రమే టికెట్ ఇచ్చారు జగన్. రామకృష్ణారెడ్డి మంగళగిరి నుంచి రెండోసారి గెలవడం.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మంత్రి పదవి తప్పదు అని అంచనా వేసుకున్నారు. కానీ ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఛాన్స్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. అయితే 2020లో అయోధ్య రామిరెడ్డికి రాజ్యసభ పదవి ఇచ్చి చేతులు దులుపుకున్నారు జగన్.
చాన్స్ లేకుండా చేసి..
2014 నుంచి 2019 వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉంది. ఆ సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు నడపడంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పాత్ర ఉంది. అప్పట్లో టిడిపి ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటం చేసేవారు రామకృష్ణారెడ్డి. దాని సత్ఫలితాలు వచ్చాయి. పార్టీ వృద్ధికి దోహదపడ్డాయి. అటువంటి వ్యక్తికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యత లేకుండా పోయింది. 2024 ఎన్నికల్లో టికెట్ ఇచ్చేందుకు కూడా అంగీకరించలేదు జగన్. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రామకృష్ణారెడ్డి షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ తిరిగి ఎలాగోలా ఆయనను వైసీపీలోకి రప్పించారు. కానీ ఇప్పుడు వైసిపి ఓడిపోవడంతో ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఎటువంటి పార్టీ బాధ్యతలు అప్పగించలేదు. మరోవైపు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి రాజ్యసభ పదవీకాలం వచ్చే ఏడాది జూన్ తో ముగియనుంది. దీంతో ఆళ్ల ఫ్యామిలీ సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.