AP Mega DSC: ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి బాధ్యత ఉండాలి. ప్రజల సమస్యలు పరిష్కరించే నేర్పు ఉండాలి. యువతకు ఉద్యోగాలు కల్పించే సత్తా ఉండాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల విషయంలో వైసిపి రంద్రాన్వేషణ చేస్తోంది. లేనిపోని విమర్శలు చేస్తూ ఇబ్బంది పెడుతోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ ని సమర్థవంతంగా అమలు చేసింది. ఉద్యోగాలను భర్తీ చేసింది. ఉద్యోగాలు సాధించిన వారంతా పేద కుటుంబాలకు సంబంధించిన వారు. ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడంతో వారు ఆనందంతో విధులు నిర్వహిస్తున్నారు. కానీ ఇందులో కూడా రాజకీయాన్ని చూసింది వైసిపి. ఇంకేముంది తన సొంత మీడియాలో రాతలు రాయడం మొదలుపెట్టింది. అంతేకాదు, మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టి అష్టవంకర్లైన కథనాలు రాస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ అధికారులు రంగంలోకి దిగారు. డీఎస్సీ నియామకాల మీద క్లారిటీ ఇచ్చారు. అది కూడా గణాంకాలతో సహా ..
శుక్రవారం విలేకరుల సమావేశంలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్, విద్యాశాఖ కార్యదర్శి శశిధర్ మాట్లాడారు.. వైసిపి చేస్తున్న ఆరోపణలకు స్పష్టమైన సమాధానం చెప్పారు.” డీఎస్సీ నిర్వహణలో అన్ని నిబంధనలు పాటించాం. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఆధారంగానే వర్టికల్ రిజర్వేషన్ విధానాన్ని, అది కూడా క్రమ పద్ధతిలో అమలు చేశాం. కేటగిరిల వారీగా పోస్టులను ఇచ్చాం. మెరిట్ ఆధారంగానే నియామకాలు జరిగాయి. వివిధ విభాగాలలో పోస్టుల భర్తీకి స్థిరమైన రోస్టర్ పాయింట్ లేదు. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ విధానం వల్లే విమర్శలు చేస్తున్నారు. జీవో 77 పై ఇంకా అనేక విమర్శలు వస్తూనే ఉన్నాయి. డీఎస్సీ నిర్వహించిన విధానంపై ఇప్పటికే అన్ని వివరాలతో ప్రకటన కూడా ఇచ్చాం. నిబంధనల ఉల్లంఘన అనేది జరగలేదు. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ గురించి తెలుసుకుంటే చాలా మంచిదని” అధికారులు వివరించారు.
“దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంపికైన వారు సరిగానే ఆ ఉద్యోగానికి అర్హులయ్యారా.. లేదా అనే విషయాలను మాత్రమే చూడాలి.. సుప్రీంకోర్టు హారిజాంటల్ రిజర్వేషన్ విధానంపై చాలా క్లారిటీగా తీర్పు ఇచ్చింది.. ఒకవేళ అభ్యర్థులకు అసంతృప్తి ఉంటే ఎందుకు ఉద్యోగం రాలేదనే కారణాలు తెలుసుకోవాలి. క్రీడలు, దివ్యాంగులకు సంబంధించిన కోటా విధానంలో రోస్టర్ పాయింట్లు అనేవి ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. గతంలో క్రీడా విభాగంలో ప్రత్యేకమైన పాయింట్ ఉండేది. ఇప్పుడు అది లేదు. ముందుగానే నోటిఫై చేసే విధానం కూడా లేదు. కేటగిరీల వారీగానే పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది.. ఒకవేళ కాల్ లెటర్ వచ్చినప్పటికీ.. ఉద్యోగానికి ఎంపిక కాకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. ప్రభుత్వం అభ్యర్థులకు పంపించింది కేవలం వెరిఫికేషన్ కాల్ లెటర్ మాత్రమే. ఒకవేళ కొంతమంది అభ్యర్థులు ఎక్కువ స్థానాలలో ఎంపికైతే.. ఒకచోట మాత్రమే తీసుకుంటారు.. ఉద్యోగం ఇచ్చే విషయంలో ఎటువంటి తప్పులు చేయలేదని” అధికారులు పేర్కొన్నారు.
ఇప్పటివరకు డీఎస్సీ విషయంలో వైసిపి రకరకాలుగా ఆరోపణలు చేసింది. సొంత మీడియాలో అడ్డగోలుగా కథనాలను ప్రసారం చేసింది. కానీ ఇప్పుడు అసలు విషయాలు అధికారులు చెప్పడంతో వైసిపి తల పట్టుకుంది. అంతేకాదు, డిఎస్సి విషయంలో ప్రభుత్వం పూర్తి క్లారిటీ తో ఉండడంతో వైసిపికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. మరి ఈ వ్యవహారంలో వైసిపి ఇంకా ఏం చేస్తుందో చూడాల్సి ఉందని టిడిపి నేతలు అంటున్నారు.
