Nagababu : నాగబాబు కోసమే పవన్ ఢిల్లీ వెళ్లారా? రాజ్యసభ పదవికి లాబీయింగ్ చేశారా? అలా జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత? రాజ్యసభ పదవి కోసం పవన్ అంతలా కష్టపడాలా? కావాలంటే చంద్రబాబు ఇవ్వరా? కేంద్ర పెద్దలు ఒప్పుకోరా? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఇచ్చింది. డిసెంబర్ 3న నోటిఫికేషన్ రానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 10 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంది. 20న ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరగనుంది. అయితే మూడు పార్టీల కూటమి స్పష్టమైన బలంతో ఉంది. వైసిపి 11 స్థానాలకు పరిమితం కావడంతో పోటీ నుంచి తప్పుకున్నట్లే.మూడు రాజ్యసభ సీట్లు కూటమి ఖాతాలో పడినట్లే.అయితే ఇక్కడే ఒక చిక్కుముడి. మూడు పార్టీలు సమానంగా పంచుకుంటాయా? టిడిపి రెండు సీట్లు తీసుకుంటుందా? మిగతా సీటు జనసేనకి ఇస్తుందా? లేకుంటే బీజేపీకి కేటాయిస్తుందా? ఇలా రకరకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పవన్ ఢిల్లీ వెళ్లారు. అది జనసేనకు రాజ్యసభ పదవి విడిచి పెట్టాలని కోరడానికేనన్న ప్రచారం నడుస్తోంది.
* అంత దూరం వెళ్లాలా?
అయితే నిజంగా రాజ్యసభ పదవి కావాలంటే పవన్ అంత దూరం వెళ్లాలా? అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఏపీలో కూటమి వెనుక పవన్ ఉన్నారు. ఎన్నికల్లో శత శాతం విజయం సాధించారు. కూటమి గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించారు. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో సైతం ప్రచారం చేశారు. ఎన్డీఏ కూటమి గెలుపునకు విశేషంగా కృషి చేశారు. దీంతో పవన్ పరపతి అమాంతం పెరిగింది. అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబుతో సైతం మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో పవన్ వెళ్లి ఢిల్లీ పెద్దలను కలిసి రాజ్యసభ పదవి కోరుతారా? అది నమ్మశక్యమేనా? ఎంత మాత్రం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
* అది తప్పుడు ప్రచారం
తాజాగా పవన్ ఢిల్లీ పర్యటనపై స్పందించారు మెగా బ్రదర్ నాగబాబు. రాజకీయాల కోసమే పవన్ ఢిల్లీ వెళ్లారన్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. అందులో ఎంత మాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. ఏపీ ప్రయోజనాల కోసమే పవన్ ఢిల్లీ వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. పవన్ కోసం పనిచేయడమే తన అంతిమ లక్ష్యమని నాగబాబు తేల్చి చెప్పారు. అలాంటి నాయకుడి కోసం నా లైఫ్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటానని ప్రకటించారు. మొత్తానికైతే పవన్ ఢిల్లీ వెళ్లడం పై జరుగుతున్న ప్రచారాన్ని చెక్ చెప్పారు నాగబాబు. మరి రాజ్యసభ పదవుల ఎంపికలో ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయో చూడాలి.