Medical college tender controversy: ఏపీలో( Andhra Pradesh) ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణం, నిర్వహణ టెండర్లకు సంబంధించిన అంశాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ద్వారా పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే అది ప్రైవేటీకరణ కాబట్టి అధికారంలోకి వచ్చిన మరుక్షణం.. అనుమతులను రద్దు చేయడమే కాదు.. అరెస్టులు సైతం చేస్తామంటూ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి కోటి సంతకాల సేకరణ కూడా చేపట్టింది. అయితే ఈ పరిణామాల నడుమ ఓ నాలుగు ప్రభుత్వ కాలేజీలకు సంబంధించి టెండర్లను ఆహ్వానించింది ప్రభుత్వం. కానీ ఒకే ఒక్క కాలేజీకి కిమ్స్ టెండర్ వేసినట్లు అధికారులు సీఎం చంద్రబాబుకు తెలిపారు. మిగతావి జగన్మోహన్ రెడ్డి భయపెట్టడంతో ఎవరూ ముందుకు రాలేదని కామెంట్స్ వినిపించాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరో బాంబు పేల్చారు అధికారులు. దరఖాస్తు చేసింది కిమ్స్ సంస్థ కాదని.. అక్కడ పనిచేసే డాక్టర్ ప్రేమ్ చంద్ అని ఇప్పుడు తాజాగా తెలుస్తోంది. టెండర్ దాఖలు చేసింది డాక్టర్ అయితే కిమ్స్ సంస్థ పేరు ఎలా చెబుతారని ఇప్పుడు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ అంశం కొత్త వివాదానికి దారితీసింది.
సీఎంకు అధికారుల వివరాలు..
ప్రభుత్వం తొలి విడతగా ఆదోని,, మదనపల్లి( Madanapalle ), పులివెందుల, మార్కాపురం మెడికల్ కాలేజీలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను అధికారులు సీఎంకు వివరించారు. ఈ నాలుగు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో నిర్మించి, నిర్వహించేలా సెప్టెంబర్ 10న ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఇందులో ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణానికి కిమ్స్ సంస్థ ముందుకు వచ్చిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అయితే ముందుకు వచ్చిన సంస్థతో ఒప్పందం చేసుకుని కాలేజీ నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. అయితే ఇప్పుడు టెండర్ వేసింది కిమ్స్ కాదని.. అందులో పని చేసే డాక్టర్ ప్రేమ్ చంద్ అని తెలుస్తోంది. ఈ విషయంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కూడా ధ్రువీకరించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది.
వైసిపి ఆందోళన పర్వం..
వాస్తవానికి వైద్య ఆరోగ్యశాఖలో ఇప్పటికే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్( public private partnership) విధానం నడుస్తోంది. ఆరోగ్యశ్రీ కూడా అలానే నడుపుతున్నారు. 108 తో పాటు టు 104 వాహనాలను కూడా అలానే నిర్వహిస్తున్నారు. వైసిపి హయాంలో కూడా అలానే నడిపారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ల నిర్వహణకు సంబంధించి పిపిపి విధానంలో అలానే ముందుకు వెళ్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తోంది. చివరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా ప్రభుత్వ విధానాన్ని సమర్థించారు. అయితే ఇప్పుడు టెండర్ వేసింది కిమ్స్ కాదు.. ఆ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ అని కొత్తగా ప్రచారం మొదలైంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.