Atchutapuram Sez Accident: అచ్యుతాపురం సెజ్ లో భారీ పేలుడు.. 18కి చేరిన మృతులు.. నేడు ఘటనా స్థలానికి సీఎం చంద్రబాబు

విశాఖపట్నం పారిశ్రామిక వాడలో ప్రమాదాలు కొనసాగుతున్నాయి. ప్రతి నెలా ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతూనే ఉంది. అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలి 18 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం భయానకంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Written By: Dharma, Updated On : August 22, 2024 9:20 am

Atchutapuram Sez Accident

Follow us on

Atchutapuram Sez Accident:  అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్ లో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలి పదుల సంఖ్యలో కార్మికులు మృతి చెందారు. అదే సంఖ్యలో గాయపడ్డారు. ఇప్పటివరకు 18 మంది మృతి చెందారు. 50 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాద తీవ్రత అధికంగా ఉంది. అచ్చుతాపురం ఫార్మా సెజ్ లోని అసెన్సియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో వందల సంఖ్యలో కార్మికులు, సిబ్బంది పని చేస్తున్నారు. భోజన విరామ సమయంలో భారీ పేలుడు సంభవించి మంటలు వ్యాపించాయి. దట్టంగా పొగ అలుముకుంది. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. పేలుడు ధాటికి పలువురు కార్మికుల మృతదేహాలు ఎగిరిపడ్డాయి. పేలుడుతో భయపడిన మిగతా కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో రెండో షిఫ్ట్ లోనే దాదాపు 350 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు సమాచారం. రియాక్టర్ పేలుడు దాటికి పరిశ్రమలోని మొదటి అంతస్తు స్లాబ్ మొత్తం కూలిపోయింది. ఆ శిధిలాల కింద చాలామంది చిక్కుకున్నారు. వారిని బయటకుతీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలువురిని సురక్షితంగా బయటకు తీశారు. ఎన్టీఆర్ ఎఫ్ సిబ్బందితోపాటు అగ్నిమాపక దళాలు సేవలందిస్తున్నాయి. 11 అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. క్షతగాత్రులను అనకాపల్లిలోని పలు ఆసుపత్రులకు తరలించారు. కాలిన గాయాలతో కొందరు మృతి చెందుతున్నారు. మొదటి అంతస్తు స్లాబ్ నుంచి దూకి ఏడుగురు ప్రాణాలు వదిలినట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరికొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

* మృతి చెందిన వారు వీరే
మృతి చెందిన వారిలో నీలపు రామిరెడ్డి, ఏజీఎం, వెంకోజి పాలెం.. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రశాంత హంస, శ్రీకాకుళం జిల్లా పొందూరు.. అసిస్టెంట్ మేనేజర్ నారాయణరావు మహంతి విజయనగరం జిల్లా గరివిడి.. సీనియర్ ఎగ్జిక్యూటివ్ గణేష్ కుమార్ కోరపాటి, తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు.. ట్రైన్ ఇంజనీర్ హారిక చల్లపల్లి కాకినాడ.. ట్రైన్ ప్రాసెస్ రాజశేఖర్ పైడి, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస… సీనియర్ ఎగ్జిక్యూటివ్ సతీష్ మారిశెట్టి, కోనసీమ జిల్లా మామిడికుదురు.. అసిస్టెంట్ మేనేజర్ నాగబాబు మొండి, సామర్లకోట.. అసిస్టెంట్ మేనేజర్ బొడ్డు నాగేశ్వర రామచంద్రరావు, కూర్మన్నపాలెం.. హౌస్ కీపింగ్ బాయ్ వేగి సన్యాసినాయుడు, రాంబిల్లి.. పెయింటర్ ఎలపల్లి చిన్నారావు, దిబ్బపాలెం.. ఫిట్టర్ పార్థసారథి, పార్వతీపురం మన్యం.. హౌస్ కీపింగ్ బాయ్ మోహన్ దుర్గ ప్రసాద్ పూడి, దెబ్బ పాలెం.. ప్రొడక్షన్ అసిస్టెంట్ మేనేజర్ ఆనందరావు బమ్మిడి, విజయనగరం జిల్లా గొల్లపేట.. ప్రొడక్షన్ అసిస్టెంట్ మేనేజర్ సురేంద్ర మర్ని, ఖమ్మం జిల్లా అశ్వరావుపేట.. సీనియర్ ఎగ్జిక్యూటివ్ పూసర్ల వెంకట సాయి, అనకాపల్లి జిల్లా బంగారమ్మ పాలెం, ఇంజనీరింగ్ విభాగానికి చెందిన జవ్వాది చిరంజీవి మృతి చెందిన వారిలో ఉన్నారు.

* నేడు సీఎం రాక
ఈరోజు సీఎం చంద్రబాబు బాధితులను పరామర్శించనున్నారు. సంబంధిత పరిశ్రమను సందర్శించనున్నారు. భారీగా ప్రాణ నష్టం జరగడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. పరిశ్రమల్లో భద్రతా చర్యలపై ఆరా తీస్తోంది. పక్కాగా భద్రత చర్యలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని కూడా హెచ్చరికలు జారీచేసింది.