Homeఆంధ్రప్రదేశ్‌Atchutapuram Sez Accident: ప్రాణాలతో పరిశ్రమల చెలగాటం.. కార్మికుల మూల్యం!

Atchutapuram Sez Accident: ప్రాణాలతో పరిశ్రమల చెలగాటం.. కార్మికుల మూల్యం!

Atchutapuram Sez Accident: విశాఖలోని పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వరుసగా జరుగుతున్న ఘటనలు కలవర పెడుతున్నాయి. నిర్లక్ష్యం, పరిశ్రమల నిర్వహణ, కార్మికుల విధుల నిర్వహణలో సరైన రక్షణ పద్ధతులు పాటించకపోవడం.. తదితర కారణాలతోనే భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. తరచూ ఏదో ఒక చోట ప్రమాదం అన్న మాట వినిపిస్తూనే ఉంది. కార్మికులు, ఉద్యోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహించాల్సిన పరిస్థితి. పనిచేస్తున్న వారు అప్రమత్తంగా ఉండడంతో పాటు యాజమాన్యాలు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం పారిశ్రామిక వాడల్లో వందలాది కంపెనీలు ఉన్నాయి. అక్కడ తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిస్సా, చత్తీస్ ఘడ్, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు పనిచేస్తుంటారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులు ఎప్పటికప్పుడు కొత్తగా విధుల్లో చేరుతుంటారు. వారికి రక్షణ పద్ధతులపై సరైన అవగాహన లేకపోవడంతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయాలంటే సిబ్బందికి నిరంతర శిక్షణతో పాటు ప్రమాదాలపై అవగాహన కల్పించే వ్యవస్థ పరిశ్రమల్లో ఉండాలి. చాలాచోట్ల వీటిని చేయకపోవడం వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయి. ప్రమాదాల నివారణ చర్యలు మొక్కుబడిగా ఉండడంతో సరైన ఫలితాలు రావడం లేదు. విశాఖలో నాలుగేళ్ల కిందట ఎల్జి పాలిమర్స్ లో స్టైల్ ఇన్ బిసవాయువు లీకై 12 మంది మృత్యువాత పడ్డారు. వెయ్యి మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. పారిశ్రామిక చరిత్రలోనే అత్యంత విషాదకరమైన ప్రమాదం అది. దానిని అధిగమించింది తాజాగా జరిగిన ప్రమాదం.

* ఆ కమిటీ అధ్యయనం ఏమైందో
ఎల్జి పాలిమర్స్ పరిశ్రమలో ప్రమాదం జరిగినప్పుడు.. వైసీపీ సర్కార్ హై పవర్ కమిటీ వేసి అధ్యయనం చేయించింది. ప్రమాదకరమైన పరిశ్రమలను ఎలా నడపాలి? ఇటువంటి భద్రతా ప్రమాణాలు పాటించాలి? ఎటువంటి తనిఖీలు చేయాలి? ఎంతెంతకాలంలో సమీక్షించాలి? వంటి అంశాలతో కమిటీ నివేదిక ఇచ్చింది. కానీ గత నాలుగేళ్లలో ఏ పరిశ్రమలో కూడా అమలు చేసిన దాఖలాలు లేవు. ఇప్పటివరకు నిబంధనల ప్రకారం ఒక్క పరిశ్రమను తనిఖీ చేసిన పరిస్థితి లేదని తెలుస్తోంది. కనీసం ఒక్క పరిశ్రమకు కూడా నోటీసు ఇవ్వలేదని సమాచారం. లోపాలను గుర్తించడం, వాటిని సవరించుకునేలా ఆదేశాలు ఇవ్వడం ప్రభుత్వ సంస్థల విధి.

* గాల్లో భద్రతా చర్యలు
విశాఖలో కేంద్ర ప్రభుత్వ సంస్థలైన స్టీల్ ప్లాంట్, హెచ్పిసిఎల్, షిప్ యార్డ్ వంటి సంస్థల్లో తప్ప ప్రైవేటు పరిశ్రమల్లో అత్యధికం ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. అధికారులు తనిఖీలకు వెళ్లకపోవడంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎక్కువగా ఫార్మా కంపెనీలోనే నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. రాంకీ ఫార్మాసిటీ, హెటీ రో డ్రగ్స్, అచ్యుతాపురం సెజ్ లో వందలాది కంపెనీలు ఉన్నాయి. వాటిలో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి నెల ఏదో ఒక కంపెనీలో పేలుడు సంభవిస్తూనే ఉంది. ఏ పరిశ్రమల్లో ప్రమాదం జరిగిన దానికి కారణాలు, లోపాలను అధికారులు వెల్లడించడం లేదు. ఆ రోజుకు బాధితులను ఆసుపత్రులకు తరలించడం, పరిశ్రమను మూసి వేయించి.. ఆ తర్వాత యధాప్రకారం నడుపుకోవాలని అనుమతులు ఇవ్వడం చేస్తున్నారు. చాలా కంపెనీల్లో భద్రతాపరమైన ఏర్పాట్లు లేకున్నా ఉత్పత్తికి మాత్రం అనుమతులు ఇస్తున్నారు.

* వైద్య సేవలు కరువే
అచ్యుతాపురం బ్రాండిక్స్, ఏపీ సెజ్ ల్లో దాదాపు 50 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. అత్యవసర సమయాల్లో వారికి సరైన వైద్య సేవలు అందడం లేదు. బుధవారం నాటి ఘటనలో వందలాదిమంది అస్వస్థతకు గురైతే అనకాపల్లి, విశాఖపట్నం ఆసుపత్రులకు తరలించాల్సి వచ్చింది. ఒక్కో బెడ్ పై ఇద్దరకు వైద్య సేవలు అందించాల్సి వచ్చింది. కనీసం ఆసుపత్రులను ఏర్పాటు చేసే పరిస్థితి కూడా లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడి చేస్తున్న ప్రభుత్వాలు తర్వాత ఆ మాటను మరిచిపోతున్నాయి. మళ్లీ ప్రమాదం జరిగినంత వరకు దాని గురించి పట్టించుకునే పరిస్థితి కూడా లేదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version