AP Volunteers: రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల రాజీనామా పర్వం కొనసాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్ల సేవలకు కోత విధించిన సంగతి తెలిసిందే. పింఛన్ల పంపిణీ తో పాటు రేషన్ సరఫరా లో వాలంటీర్లు పాల్గొనవద్దని ఎలక్షన్ కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తున్నారు. అయితే వారంతా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకే రాజీనామాలు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రజలకు సేవ చేయకుండా అడ్డుకున్నందుకే తాము రాజీనామాలు చేస్తున్నామని వాలంటీర్లు చెబుతున్నారు. దీంతో ఇది ఒక రాజకీయ రగడగా మారింది.
ఎన్నికల ముంగిట ఇదో రాజకీయాంశంగా మలుచుకోవాలని అధికార వైసిపి తో పాటు టిడిపి భావిస్తోంది. ఒకరుకు మించి ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. వాలంటీర్ల పై ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉందని టిడిపి ఆరోపిస్తోంది. ప్రభుత్వం వద్ద నగదు లేకపోవడం వల్లే పింఛన్లు ఇవ్వలేదని.. దానిని మసి పూసి మారేడు కాయ చేసే విధంగా వ్యవహరిస్తున్నారని.. ఇందులో తమ ప్రమేయం లేదని టిడిపి నేతలు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15,005 గ్రామ/ వార్డు సచివాలయాలు ఉన్నాయని… ప్రతి సచివాలయం పరిధిలో 427 మంది లబ్ధిదారులు ఉన్నారని.. 11 మంది సచివాలయ ఉద్యోగులు ఒక్కొక్కరు 38 మందికి గంట వ్యవధిలో పింఛన్లు ఇవ్వవచ్చని టిడిపి సోషల్ మీడియా ట్రోల్ చేస్తోంది. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడం వల్లే లేనిపోని సమస్యలను తెరపైకి తెస్తున్నారని ఆరోపిస్తోంది.
ప్రతి 50 కుటుంబాలకు వాలంటీర్ పనిచేస్తున్నారు. సంక్షేమ పథకాలతో పాటు పౌర సేవలను పర్యవేక్షిస్తున్నారు. ఆ 50 కుటుంబాలతో సత్సంబంధాలు కలిగి ఉండడంతో.. వాలంటీర్ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నాలను తిప్పికొట్టే క్రమంలో విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు చేస్తున్నాయి. దీంతో ఈసీ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యింది. సంక్షేమ పథకాల పంపిణీలో వాలంటీర్ల పాత్ర ఉండకూడదని స్పష్టం చేసింది. అయితే దీనిని సాకుగా చూపి చాలామంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో వాలంటీర్ వ్యవస్థ పై తమకు ఎటువంటి చెడు అభిప్రాయం లేదని.. రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని.. వాలంటీర్ల సేవలు కొనసాగిస్తామని తెలుగుదేశం పార్టీ చెబుతోంది. వాలంటీర్లు లేకపోయినా.. గంటలో సచివాలయం ఉద్యోగులతో పింఛన్లు పంపిణీ చేయవచ్చని ప్రచారం చేస్తోంది. అయితే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయో.. మరి ఏ ఇతర కారణాలో తెలియదు కానీ.. వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు మాత్రం చర్చనీయాంశంగా మారాయి.