Ashok Gajapathi Raju: తెలుగుదేశం పార్టీలో హై ప్రొఫైల్ గల నాయకుడు అశోక్ గజపతిరాజు. పార్టీలో నెంబర్ 2. పార్టీ అధినేతకు సమకాలీకుడు. పార్టీ పట్ల అత్యంత విధేయుడు కూడా. ఇంతవరకు పక్క చూపులు చూడని నేత కూడా ఆయనే. నిజాయితీ,నిబద్ధతతో వ్యవహరిస్తూ వస్తున్న అశోక్ గజపతిరాజు రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇక సెలవు అంటూ తప్పుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవుతానని ప్రకటించారు. అయితే ఇది తనకు తానుగా తీసుకున్న నిర్ణయమా? అసంతృప్తితో తీసుకున్న నిర్ణయమా? లేకుంటే ఈ కుళ్ళు రాజకీయాల నుంచి దూరం కావాలని భావించారా? అన్నది తెలియాల్సి ఉంది.
అశోక్ గజపతిరాజు అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. విజయనగర సంస్థానాధిస్తులైన గజపతి రాజుల వారసుడే అశోక్ గజపతిరాజు. తండ్రి డాక్టర్ పివిజి రాజు, సోదరుడు ఆనంద గజపతిరాజులు సైతం రాజకీయాల్లో రాణించారు. వారి తరువాత అశోక్ గజపతిరాజు రాజకీయాల్లో తిరుగులేని నేతగా మారారు. తొలిసారిగా 1978లో జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. మొత్తం పదిసార్లు ఎన్నికల్లో పోటీ చేయగా ఎనిమిది సార్లు విజయం సాధించారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఓటమి తప్పలేదు. విజయనగరం జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్నారు. తెలుగుదేశం పార్టీని ఏకతాటిపై నిలపడంలో అశోక్ గజపతిరాజు సక్సెస్ అయ్యారు.
అశోక్ గజపతిరాజు చంద్రబాబుకు సమకాలీకుడు. 1978లో ఇద్దరూ ఒకేసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. కానీ తెలుగుదేశం పార్టీలో మాత్రం చంద్రబాబు కంటే సీనియర్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అశోక్ ఆ పార్టీ వెంట నడవగా.. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రబాబు ఓడిపోయిన తర్వాత తెలుగుదేశంలో చేరారు. ఎన్టీఆర్ కు ఎంత నమ్మకమైన నేతగా ఉండేవారో… చంద్రబాబు విషయంలో సైతం అశోక్ అలానే వ్యవహరించారు.1995,1999 టిడిపి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అశోక్ గజపతిరాజుకు కీలక పోర్టు పోలియోలు అప్పగించారు. పార్టీలోనూ కీలక బాధ్యతలు అప్పగించారు. 2014లో విజయనగరం ఎంపీగా గెలిచిన అశోక్ కు కేంద్ర మంత్రి పదవి కూడా దక్కింది. పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక వినూత్న సంస్కరణలతో బ్రాండ్ క్రియేట్ చేశారు. 2019 ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు.
అయితే గత ఐదేళ్ల వైసిపి ప్రభుత్వంతో అశోక్ గజపతిరాజు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత చాలాసార్లు అశోక్ గజపతి రాజును టార్గెట్ చేసుకున్నారు. మానస చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజును తొలగించారు.ఆయన సోదరుడు ఆనంద గజపతిరాజు మొదటి భార్య కుమార్తె అయిన సంచయిత గజపతి రాజును నియమించారు. దీంతో అశోక్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో మాన్సాస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ పరిణామాల క్రమంలో పోలీస్ కేసులకు సైతం గురయ్యారు. అటు వయోభారంతో అనారోగ్యానికి గురయ్యారు. ఈ తరుణంలో అశోక్ పోటీపై సందిగ్ధత నెలకొంది. విజయనగరం అసెంబ్లీ స్థానానికి కుమార్తె అదితి గజపతిరాజు అభ్యర్థిగా.. ఎంపీ అభ్యర్థిగా కలిశట్టి అప్పలనాయుడు పేర్లను టిడిపి హై కమాండ్ ప్రకటించింది. అయితే అశోక్ను పక్కకు తప్పించారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని తెరదించుతూ అశోక్ మీడియా ముందుకు వచ్చి కీలక ప్రకటన చేశారు. అనారోగ్య కారణాలతోనే తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవుతున్నానని ప్రకటించారు. అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదని చెప్పుకొచ్చారు. దీంతో రాజుగారు గౌరవంగా రాజకీయాల నుంచి పప్పుకున్నారని తెలుస్తోంది.