Margadarsi: కృషి బ్యాంక్, చార్మినార్ బ్యాంక్, అగ్రిగోల్డ్, సహారా, సత్యం ఇవన్నీ పెద్ద పెద్ద సంస్థలు. బ్యాంకు బ్యాలెన్స్, లాభాలను కోట్లల్లో చూపించినవే. కానీ వీటి మేడిపండు బాగోతం విప్పి చూస్తే గాని బయటికి సమాజానికి తెలియ రాలేదు.. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. ఖాతాదారులకు కోట్లలో నష్టం వాటిల్లింది. ఖాతాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు నేరుగా ప్రభుత్వాలు రంగంలోకి దిగాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు పై వాటి జాబితాలోకి మార్గదర్శి వెళ్లిందా? మార్గదర్శి కూడా రేపో మాపో ఇలానే కాబోతోందా? అంటే దీనికి అవును అనే సమాధానాలు చెబుతున్నాయి ఏపీ ప్రభుత్వ వర్గాలు
మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద గత కొంతకాలంగా ఏపీ సిఐడి అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సంస్థ ఒక మేడిపండు సామెత తీరుగా ఉందని అధికారులు అంటున్నారు. ” ఆర్థిక అక్రమాలు గుట్టలు గుట్టలుగా బయటపడ్డాయి. ఫోర్జరీ సంతకాలతో మోసాలు చేశారు. చందాదారులకు తెలియకుండానే చిట్టి పాటలు పాడారు. మేనేజ్మెంట్ టికెట్ల పేరిట బురిడీ లు కొట్టించారు. ఏజెంట్ల ద్వారా కనికట్టు ప్రదర్శించారు. శాఖల నుంచి ప్రధాన కార్యాలయానికి నిధులు మళ్ళించారు. ప్రస్తుతం మార్గదర్శి కి చెందిన ఆ బ్యాంకు ఖాతాలు నిధులు లేక ఖాళీగా ఉన్నాయని” ఏపీ సిఐడి అధికారులు అంటున్నారు.. చందా దారుల సొమ్ముతో రామోజీరావు తన వ్యాపార విస్తరణకు ఉపయోగించుకున్నారని ఏపీ సిఐడి అధికారులు అంటున్నారు. ఇలా అనేక రకాల అవకతవకలకు పాల్పడటం వల్ల మార్గదర్శి వ్యవహారం దినదిన గండం గా మారిందని ఏపీ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మార్గదర్శి మరో అగ్రిగోల్డ్ అవుతుందని తెలుస్తోంది.
ఏపీలోని మార్గదర్శికి సంబంధించి 37 శాఖల్లో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ, ఏపీ సిఐడి అధికారులు గురువారం సోదారు నిర్వహించారు. ప్రత్యేక బృందాలతో ఏకకాలంలో చేపట్టిన ఆకస్మిక సోదాల్లో భారీగా ఆర్థిక అవకతవకలు వెలుగులోకి వచ్చాయని ప్రచారం జరుగుతోంది. కేంద్ర చిట్ ఫండ్స్ చట్టం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు, ఇండియన్ పీనల్ కోడ్ కింద కూడా పలు నేరాలకు మార్గదర్శి యాజమాన్యం పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. మార్గదర్శిలో జరుగుతున్న వ్యవహారాలపై ఆ సంస్థ చైర్మన్ రామోజీరావు ఏ_1, మేనేజింగ్ డైరెక్టర్ శైలజాకిరణ్ ఏ_2, బ్రాంచ్ మేనేజర్ల ను ఏ_3 గా సిఐడి కేసులు నమోదు చేసింది. చార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, సిఐడి అధికారుల బృందాలు చేపట్టిన సోదాలు శుక్రవారం కూడా కొనసాగుతున్నాయి. శనివారం నాటికి ఇవి ముగిసే అవకాశాలు ఉన్నాయని ఏపీ సిఐడి వర్గాలు అంటున్నాయి.