Journalist: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టులకు మంచి రోజులు ఖాయమని ఉద్యమసారథి, గత సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పారు. అధికారంలోకి వచ్చాక మాత్రం ఇదిగో.. అదిగో అంటూ ఊదరగొట్టారు. జర్నలిస్టుల హెల్త్ స్కీం విషయంలో పట్టిపట్టనట్లు వ్యవహరించారు. ఇక ఇండ్ల స్థలాల విషయంలో మాత్రం ఆయన స్పందన అత్యంత దారుణంగా ఉండేది. పదేండ్ల పాటు ఇండ్ల స్థలాల విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత ఎన్నికల ముందు ఒకటి రెండు జిల్లాల్లో మాత్రం మంత్రులు, ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఉన్న వారికి ఇండ్ల స్థలాలు అందించి చేతులు దులుపుకున్నారు. అయితే జర్నలిస్టుల విషయం ముందు నుంచి మాజీ సీఎం కేసీఆర్ ఇలాగే వ్యవహరించారనే అపవాదును మూటగట్టుకున్నారు. ఏండ్లు మారినా, ప్రభుత్వాలు మారినా జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయంలో పరిస్థితి లో మార్పు రావడం లేదంటూ పలువురు జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏదో చేస్తాడనుకున్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు అదే దారిలోకి వెళ్తున్నారు. నిన్న మొన్నటి దాకా ఇదిగో ఇండ్ల స్థలాలంటూ ఆయన ఊరించారు. నెల రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని కూడా ప్రకటించారు. తాజాగా ఇండ్ల స్థలాల విషయంలో మరోసారి గెలిపిస్తే తగు నిర్ణయం తీసుకుంటామంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న వ్యతిరేకత ఆయనకు తెలియనది కాదు ఇలాంటి సందర్భంలో జర్నలిస్టులను కూడా ఆయన దూరం చేసుకుంటున్నారని పలువురు చెబుతున్నారు.
జర్నలిస్టులతో తనలా ఫ్రెండ్లీగా వ్యవహరించే సీఎం ఇప్పటివరకు ఎవరూ లేరంటూ చెప్పుకొనే రేవంత్ రెడ్డి ఇలా వ్యవహరించడంతో ఇప్పడు కంగుతినడం జర్నలిస్టుల వంతైంది. చాలీ చాలని జీతాలు, లైన్ అకౌంట్లతో బతుకులీడుస్తున్న జర్నలిస్టుల విషయంలో కొంత పాజిటివ్ చూపించాల్సిన నేతలు ఇలా వ్యవహరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
అవసరం తీరాక రాజకీయాలు ఇలానే ఉంటాయని మండిపడుతున్నారు. నేడో, రేపో ఇండ్ల స్థలాలు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్న హైదరాబాద్ జర్నలిస్టులకు ఇలాంటి నిర్ణయం ఇప్పుడు మింగుడుపడడం లేదు. కేసీఆర్ లాగే సీఎం రేవంత్ రెడ్డి ఇఫ్పుడు నమ్మించి గొంతు కోశారని పలువురు చర్చించుకుంటున్నారు.
జర్నలిస్టుల విషయంలో ప్రభుత్వాల తీరు అత్యంత దారుణంగా ఉందని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఏండ్ల తరబడి అక్రెడిటేషన్లు, ఇండ్ల స్థలాల కోసం ఎదురు చూడడం మినహా తమ ఎదురుచూపులు ఫలించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వమైనా తమ గోడు వింటుందని ఆశిస్తే, పరిస్థితి గతంలోలాగే కనిపిస్తున్నదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మళ్లీ గెలిస్తే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించడమేంటని లోలోన మండిపడుతున్నారు. ఏదేమైనా అటు సంస్థల్లో సరైన జీతాలు లేక, ఇటు ప్రభుత్వం ఇస్తామన్న ఇండ్ల స్థలాలు రాక జర్నలిస్టులు ఆందోళనలో పడ్డారు. ప్రస్తుతం తమ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.