Deputy Speaker: నరసరావుపేట ఎంపీగా 2019లో వైఎస్సార్సీపీ నుంచి విజయం సాధించారు రఘురామకృష్ణరాజు. తదనంతరం సొంత పార్టీ, ప్రభుత్వంపైనే తిరుగుబాటు చేశారు. ప్రభుత్వం తీరుపై ఆయన ఆది నుంచి పోరాటం చేస్తూ వచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన జగన్ సర్కారు ఆయనను వివిధ కేసుల్లో ఇరికించింది. పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి ఆయనను అడుగడుగునా వేధించింది. జైల్లో ఆయనను చిత్రహింసలకు గురిచేసింది. ఈ క్రమంలో ఆయన కేంద్రం సహాయాన్ని కోరారు. రాష్ర్ట ప్రభుత్వం తనను చిత్రహింసలకు గురి చేస్తున్నదంటూ గతంలో లోక్ సభ స్పీకర్, ప్రధానిని కలిసి విన్నవించారు. ఇక ఢిల్లీలోనే ఆయన ఎక్కువ కాలం మకాం వేశారు. ఏపీలో తనపై నిర్బంధం ఉందంటూ మీడియా ముఖంగా చాలా సార్లు ఆయన ప్రస్తావించారు. జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. తాను అభ్యర్థిగా పోటీ చేసిన పార్టీపైనే ఆయన పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. దీనికి జగన్ వ్యవహారశైలి, కొందరు నేతలే కారణమంటూ రఘురామ ఆరోపించేవారు. ఏకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన రచ్చబండను నిర్వహించారు. జగన్ సర్కారు అవినీతి పెద్ద పోరాటమే నిర్వహించారు. దీంతో జగన్ సర్కారు ఆయనపై ఏకంగా రాజద్రోహం కేసు నమోదు చేసింది. చిత్రహింసలకు గురిచేసింది. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. జగన్ పై సుదీర్ఘ పోరాటమే చేశారు. వైసీపీ వేధింపులను భరిస్తూనే ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. వైకాపా నేతల అవినీతి విషయంలో ఆయన పోరాటం ప్రజల్లోనూ గుర్తింపు తెచ్చింది.
కొన్ని రోజుల పాటు అటు బీజేపీ, ఇటు టీడీపీకి సమదూరంలో నడిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా పలు సందర్భాల్లో సీఎం చంద్రబాబు కూడా రఘురామపై జరిగిన దాడిని ఖండించారు. ఆయనను వేధించిన తీరుపై మండిపడ్డారు. రఘురామకు అండగా నిలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఉండి అభ్యర్థిని మార్చి మరి ఈ ఎన్నికల్లో రఘురామకు అవకాశం కల్పించారు.
ఆయనను తాజాగా సీఎం చంద్రబాబు డిప్యూటీ స్పీకర్ పదవికి ఎంపిక చేశారు. దీంతో నామినేషన్లు ఏమి రాకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత ప్రభుత్వ హయాంలో తనను వేధించిన అధికారులను వదిలేది లేదని చెప్పారు. అనుకున్నట్లుగానే వారిపై కేసులు నమోదు చేయించారు. ఇక జగన్ అక్రమాస్తుల కేసు విషయంలో కూడా ఆయన కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులను వేగంగా విచారించాలంటూ ఆయన పిల్ వేశారు.
తెలంగాణ హైకోర్టు నుంచి వెంటనే ఈ కేసును మార్చాలంటూ ఆయన ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఏదేమైనా రఘురామ ఎన్నో అవమానాలు, బెదిరింపులను దాటుకొని ప్రస్తుతం ఏపీ డిప్యూటీ స్పీకర్ గా ఎంపికవడంపై ప్రశంసలు వినిపిస్తున్నాయి.