Nara Lokesh: తెలుగుదేశం( Telugu Desam) పార్టీ కొత్త ప్రమాదంలో పడుతోంది. ప్రతి జిల్లాలో లోకేష్ మనసులు అంటూ చాలామంది నేతలు రెచ్చిపోతున్నారు. కూటమి ప్రభుత్వంలో లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలన్న డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. ఇది పెను దుమారానికి దారితీస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే లోకేష్ టీమ్ లో చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారు. లోకేష్ మనుషులుగా ఉంటే పార్టీలో ప్రాధాన్యం పెరగడంతో పాటు పదవులు దొరుకుతాయని ఎక్కువ మంది ఆశిస్తున్నారు. దాదాపు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు.. ప్రతి జిల్లాలో లోకేష్ టీం తయారయింది. అయితే గతం నుంచి ఉన్నవారు కాకుండా కొత్త వారు హల్చల్ చేస్తున్నారు. దీంతో ఇది పార్టీకి ఇబ్బందికరంగా మారింది. చాలామంది యువ నాయకులు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా లోకేష్ గళం వినిపిస్తున్నట్లు తెలుస్తోంది.
* యువనేత పేరుతో హడావిడి
ఇప్పటికే రాష్ట్రస్థాయిలో లోకేష్( Nara Lokesh) టీం హవా నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ భావి నాయకుడిగా లోకేష్ ప్రొజెక్టు అవుతున్నారు. అందులో తప్పులేదు కానీ.. లోకేష్ పేరు చెప్పుకుంటూ చాలామంది పబ్బం గడిపేస్తున్నారు. సొంత పార్టీలో విభేదాలకు కారణం అవుతున్నారు. చిత్తూరు జిల్లాలో ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది. ఓ ఇద్దరూ ఎమ్మెల్యేలను యువనేత తెగ ఇబ్బందులు పెడుతున్నట్లు తెలుస్తోంది. అయినదానికి కాని దానికి లోకేష్ పేరు చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఆ ఎమ్మెల్యేలు లోకేష్ తో పాటు చంద్రబాబు పట్ల ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది.
* చిత్తూరులో యువ నాయకుడు హల్ చల్
కూటమి( Alliance) అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టులను ప్రకటించింది. అందులో భాగంగా చిత్తూరు జిల్లాకు చెందిన అనిమిని రవి నాయుడు నియమితులయ్యారు. ఈయన లోకేష్ కు చెందిన వ్యక్తిగా పేరు ఉంది. పైగా చంద్రబాబుతో బంధుత్వం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఇటీవల ఆయన అన్ని అంశాల్లో వేలు పెడుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా చిత్తూరు, చంద్రగిరి నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలపై ఎప్పటికప్పుడు నివేదికలు హై కమాండ్కు పంపిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. చంద్రబాబుకు సమీప బంధువు అవుతానని.. వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి టికెట్ తనదేనంటూ ప్రచారం చేస్తుండడంతో.. సిట్టింగ్ ఎమ్మెల్యే పులివర్తి నాని తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
* గంటా కుమారుడి హాట్ కామెంట్స్
ఇటీవల విశాఖలో గంటా శ్రీనివాసరావు( Ghanta Srinivasa Rao ) కుమారుడు లోకేష్ విషయంలో హాట్ కామెంట్స్ చేశారు. లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ పై అనేక రకాల చర్చ నడిచింది. దీనిపై ఎవరూ మాట్లాడవద్దని హై కమాండ్ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. కానీ గంటా శ్రీనివాసరావు కుమారుడు మాత్రం లోకేష్ విషయంలో మాట్లాడారు. దేశానికి ప్రధాని అయ్యే అర్హత లోకేష్ కు ఉందంటూ సంచలన కామెంట్స్ చేశారు. అయితే కేవలం లోకేష్ దృష్టిలో పడాలన్న కోణంలో ఎక్కువమంది యువ నేతలు పోటీపడి మరి వ్యాఖ్యలు చేస్తున్నారు. అవి అంతిమంగా తెలుగుదేశం పార్టీకి నష్టం చేస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కూటమి ధర్మానికి విఘాతం కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఇటువంటి వారిని కట్టడి చేయాలని లోకేష్ కు సూచిస్తున్నారు.