Manthena Satyanarayana Raju: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం వినూత్న నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు నైతిక విలువలు పెంపొందించే బాధ్యతను కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఆయనకు క్యాబినెట్ హోదాతో కూడిన పదవి కూడా ఇచ్చారు. అయితే తాజాగా ప్రకృతి వైద్యుడిగా మంచి పేరు తెచ్చుకున్న డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజుకు సైతం కీలక బాధ్యతలు కట్టబెట్టింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు కొన్ని దశాబ్దాలుగా ప్రకృతి వైద్యం ద్వారా ఎన్నో రోగాలను నయం చేశారు. ఉండవల్లి కరకట్టపై ప్రకృతి చికిత్సలయం పేరుతో ఒక ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. ప్రకృతి వైద్యం విషయంలో సలహాలు అందించేందుకు ఆయనను సలహాదారుడిగా ఏపీ ప్రభుత్వం నియమించినట్లు తెలుస్తోంది.
మందులు లేని వైద్యం..
ప్రధానంగా మంతెన సత్యనారాయణ రాజు( Manthena Satyanarayana Raju) మనిషిలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, మందులు లేకుండా వ్యాధులను నయం చేయడానికి ఉప్పు రహిత, నూనె రహిత ఆహారాలు, యోగ, సహజ చికిత్సలు అందిస్తుంటారు. ఆయనకు విజయవాడతోపాటు నరసాపురం, అమరావతిలో ఆరోగ్యాలయం కేంద్రాలు ఉన్నాయి. వీటిలో రోగులకు ఆయనతో పాటు భార్య డాక్టర్ విశాలా కూడా సేవలు అందిస్తుంటారు. కేవలం నీరు, బురద, ఉపవాస, సూర్యకాంతి చికిత్సలు అందిస్తుంటారు. ప్రతిరోజు టీవీ ఛానల్ తో పాటు యూట్యూబ్ లలో కూడా ప్రకృతి వైద్యం అందించడంలో ముందున్నారు మంతెన సత్యనారాయణ రాజు.
సీఎంతో మంచి సంబంధాలు..
ఏపీ సీఎం చంద్రబాబుతో మంతెన సత్యనారాయణ రాజుకు మంచి సంబంధాలు ఉన్నాయి. టిడిపి నేతలతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వైద్యం విషయంలో సలహాలు సూచనలు తీసుకునేందుకు ఆయనను సలహాదారు పదవిలో నియమించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన జీతభత్యాలకు సంబంధించి ఎటువంటి అంశాలు బయటకు రాలేదు. కానీ ఈరోజు మాత్రం నియామక ఉత్తర్వులు వచ్చాయి. జీతభత్యాలతో పాటు హోదా విషయంలో ప్రత్యేక ఉత్తర్వులు ద్వారా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.