Big challenge for Jagan: ఆంధ్రప్రదేశ్లో హాట్ నియోజకవర్గంలో మంగళగిరి ఒకటి. తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తుండడంతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది ఆ నియోజకవర్గం. రోజురోజుకు ఆ నియోజకవర్గంలో పట్టు పెంచుకుంటున్నారు లోకేష్. రెండు ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవగా.. గత ఎన్నికల్లో మాత్రం టిడిపి గెలిచింది. అప్పటి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి చేయి దాటుతోంది. కనీసం ఆ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అండగా నిలిచే నేత కూడా కరువయ్యారు. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆ నియోజకవర్గంపై సీరియస్గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో అనవసరంగా ప్రయోగం చేసి చేతులు కాల్చుకున్నారు జగన్. అందుకే ఇప్పుడు సరైన నేతను రంగంలోకి దించాలని భావిస్తున్నట్లు సమాచారం.
రెండుసార్లు ఎమ్మెల్యేగా
మంగళగిరిలో నారా లోకేష్ ను ఓడించి జైంట్ కిల్లర్గా నిలిచారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆళ్ల అయోధ్య రామిరెడ్డి సోదరుడు ఈయన. 2014లో వైసీపీ తరఫున మంగళగిరి నుంచి పోటీ చేసి గెలిచారు రామకృష్ణారెడ్డి. ఆ ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చింది. కానీ రాజధాని ప్రాంత ఎమ్మెల్యేగా దూకుడుగా ఉండేవారు రామకృష్ణారెడ్డి. అప్పటి ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతూ న్యాయస్థానాలను ఆశ్రయించేవారు. అలా కొన్ని కేసుల్లో సక్సెస్ అయ్యారు కూడా. అయితే 2019లో రెండోసారి మంగళగిరి నుంచి గెలిచారు. అప్పుడు మంత్రిగా ఉన్న నారా లోకేష్ పై గెలవడంతో రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఖాయమని భావించారు. కనీసం ప్రభుత్వ విప్ గా కూడా అవకాశం ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. అయినా సరే పార్టీలో కొనసాగుతూ వచ్చారు రామకృష్ణారెడ్డి. 2024 ఎన్నికల్లో రామకృష్ణారెడ్డిని కాదని చేనేత వర్గానికి చెందిన ఓ మహిళ నేతకు టికెట్ ఇచ్చారు జగన్. కానీ ఆమె లోకేష్ చేతిలో దారుణంగా ఓడిపోయారు.
అండగా నిలిచే నేత లేక..
ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీకి నాయకుడు లేకుండా పోయారు. మరోవైపు చూస్తే మంగళగిరిలో లోకేష్ పట్టు బిగిస్తున్నారు. దరిదాపుల్లో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాలేనంతగా బలోపేతం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ నియోజకవర్గ పరిస్థితిని గమనించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆళ్ల రామకృష్ణారెడ్డికి తిరిగి బాధ్యతలు అప్పగించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి రాజ్యసభ పదవి వచ్చే ఏడాది జూన్ తో ముగియనుంది. అయితే తన అవసరాల కోసం సోదరులు ఇద్దరినీ జగన్మోహన్ రెడ్డి వాడుకున్నారు. అందుకే ఇప్పుడు జగన్ ఆదేశాలతో మంగళగిరి నియోజకవర్గ బాధ్యతలు తీసుకుంటారో లేదో చూడాలి.