Mahanadu 2025: కడపలో( Kadapa ) మహానాడు నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు మహానాడు జరగనుంది. ఏటా ఎన్టీఆర్ జయంతి నాడు మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది మహానాడు వేదికను కడపగా నిర్ణయించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమి, టిడిపి కూటమి దూకుడు వెరసి.. ఈ ఏడాది మహానాడు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ అడ్డాగా ఉన్న కడపలో నిర్వహించి సవాల్ విసరాలని భావిస్తున్నారు. మరోవైపు చంద్రబాబుకు 75 వసంతాలు నిండడంతో.. ఈ మహానాడు ప్రత్యేకంగా నిలవనుంది.
Also Read: వల్లభనేని వంశీ మోహన్ కు బెయిల్.. అయినా సరే జైల్లోనే! కారణమదే
* కడపలో తొలిసారిగా..
తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) ఆవిర్భావం నుంచి ఏటా మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కడపలో తొలిసారిగా మహానాడు నిర్వహిస్తున్నారు. కమలాపురం నియోజకవర్గ పరిధిలో స్థలాన్ని ఎంపిక చేశారు. నెలల ముందు నుంచే కార్యాచరణ ప్రారంభించారు. ప్రధానంగా రాయలసీమ జిల్లాల నుంచి భారీగా జనాలను సమీకరించాలని భావించారు. చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ తో భారత్ యుద్ధం ప్రారంభం అయ్యింది. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో మహానాడు ను వాయిదా వేయాలని అనుకున్నారు. ఉద్రిక్తతలు చల్లారడం, కాల్పుల విరమణ దిశగా రెండు దేశాలు నడుస్తున్న నేపథ్యంలో.. తిరిగి మహానాడు పనులు చేపట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
* కమిటీల ఏర్పాటు.. మహానాడుకు( mahanadu) సంబంధించి ఇప్పటికే కమిటీలు వేశారు. రాష్ట్ర మంత్రులతో పాటు కీలక నేతలు ఈ కమిటీల్లో ఉన్నారు. మరోవైపు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో మరో ఐదు నుంచి 6 కమిటీలను వేయనున్నారు. వీటిలో పోలిట్ బ్యూరో కమిటీ కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. భోజనాల కమిటీ, కార్యక్రమ నిర్వహణ కమిటీ, అజెండా కమిటీ, ఏర్పాట్ల కమిటీ, ప్రత్యేక ఆహ్వానితుల కమిటీ.. ఇలా కమిటీలు కీలకంగా వ్యవహరించునున్నాయి. మహానాడు నిర్వహణ ఈ కమిటీల పైనే ఆధారపడి ఉంది. అందుకే సీఎం చంద్రబాబు ఈ కమిటీ సభ్యులకు దిశా నిర్దేశం చేయనున్నారు.
* మళ్లీ పనులు ప్రారంభం..
పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం నేపథ్యంలో.. మహానాడు వాయిదా వేస్తారని అంతా భావించారు. దీంతో పనులు కొంతవరకు మందగించాయి. అయితే ఇప్పుడు ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో కడప జిల్లా కమలాపురంలో( kamalapuram ) మహానాడు నిర్వహణ పనులు మళ్లీ పుంజుకున్నాయి. అక్కడ రేయింబవళ్లు పనులు కొనసాగుతున్నాయి. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సతీష్ రెడ్డి ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎండాకాలం కావడంతో తాగునీటి కోసం వందకు పైగా ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున చలువ పందిళ్ళు వేస్తున్నారు. ఎండాకాలం కావడంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నారు. వర్షాలకు తడవకుండా ఉండేందుకు ప్రత్యేక టార్పాలిన్లు సైతం అందుబాటులోకి తెచ్చారు. ప్రాంగణంలో భారీ కూలర్లు ఏర్పాటు చేయనున్నారు.