Lokesh : 90వ దశకంలో రాజకీయాల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. రాత్రికి రాత్రే ఎవర్ గ్రీన్ నాయకులు తెరపైకి వచ్చేవారు. బలమైన ప్రత్యర్థులున్న చోట సహజంగానే రిగ్గింగులు జరుగుతుండేవి. దానిని సహించలేక ఓ సామాన్య వ్యక్తులు పోలింగ్ బూతుల్లో ఉండే బ్యాలెట్ బాక్సుల్లో సిరా పోయడం, అదే బాక్సులను బావుల్లో వేయడం చేసేవారు.అలా చేసిన వారిని ప్రజలు కూడా నాయకులుగా చూడడం ప్రారంభించేవారు. అనతికాలంలో ఆ ఊర్లో ఆ వ్యక్తులు బలమైన నాయకులుగా మారేవారు. ఇప్పుడు చిన్న బాబు లోకేష్ సైతం అదే ఫార్ములాను అనుసరిస్తున్నారు. టీడీపీ నాయకులకు ఏకంగా ఆషాడం ఆఫర్ ప్రకటించారు. అధికార పార్టీ దాష్టీకాలను ఎదుర్కొనే క్రమంలో ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే అంత ప్రాధాన్యం కలిగిన నామినేటెడ్ పోస్టు ఇస్తానని హామీ ఇచ్చారు.
వచ్చే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి జీవన్మరణం లాంటివి. అందుకే చంద్రబాబు, లోకేష్ లు అహర్నిషలు శ్రమిస్తున్నారు. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే లోకేష్ యువగళం పాదయాత్ర కోసం ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. అలుపెరగకుండా శ్రమపడుతున్నారు. అటు చంద్రబాబు సైతం వయసును లెక్క చేయకుండా రాష్ట్ర వ్యాప్త పర్యటనలతో బిజీగా ఉన్నారు. క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అయినా సరే చాలా చోట్ల కేడర్ లో నిర్లిప్తత ఉంది. కేసులకు భయపడి పార్టీ శ్రేణులు ముందుకు రావడం లేదు. వారిని తట్టి లేపి పోరాటబాట పట్టించేందుకు తండ్రీ కుమారులు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. ఈ తరుణంలో కొన్నిరకాల కఠిన నిర్ణయాలకు సిద్ధపడుతున్నారు.
చాలా మంది టీడీపీ నాయకుల్లో మనకెందుకొచ్చింది కేసుల గొడవ అంటూ రాజీపడి బతికేస్తున్నారు. విషయాన్ని గమనించిన లోకేష్ ఒక వినూత్న ఆలోచన చేశారు. భయపడకండి వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనంటూ వారిలో భరోసా కల్పిస్తున్నారు. ఎవరిపై ఎక్కువ కేసులు ఉంటే వారికే మంచి ప్రాధాన్యత కలిగిన నామినేటెడ్ పోస్టు ఇస్తామని ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. దీనికి టైమ్ జోన్ కూడా సెట్ చేశారు. 2019, 2024 మధ్య ఎవరైతే అధికార పార్టీతో ఇబ్బందులుపడ్డారో.. ఎక్కువ కేసులు నమోదయ్యాయో.. అటువంటి వారి నాయకత్వాన్ని గుర్తించుకుంటామని తన యువగళం పాదయాత్ర వేదికగా ప్రకటించారు.
అయితే ఇది మంచి అవకాశమే అంటున్న టీడీపీ కేడర్ ఒక విషయంలో మాత్రం ఆలోచిస్తోంది. టీడీపీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులు. మరి రాకుంటే అన్న విషయాన్ని గుర్తెరిగి ఉలిక్కిపడుతోంది. అప్పుడు జీవితాంతం కేసులు, గొడవలంటూ పోలీసులు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని భయపడుతోంది. మీకు అధికారం కోసం మేము గొడవలు పడలా అంటూ అంతర్మథనం చెందుతున్నాయి. అయితే నాయకుడి ఈ తరహా చర్యలు మంచిది కాదని.. సమాజంలో అశాంతికి కారణమవుతాయని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. సో చిన్నబాబు పిల్లుపు పెద్దగా వర్కవుట్ కాదన్నమాట.