Local Body Elections In AP: ఏపీలో( Andhra Pradesh) స్థానిక సంస్థల ఎన్నికలపై రకరకాల చర్చ నడుస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా ఎన్నికలు పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. మార్చి 7 వరకు అవి కొనసాగనున్నాయి. అదే నెల 9న కొత్త ఓటరు జాబితాను ప్రదర్శించనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ క్షణంలోనైనా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. అయితే జనగణన, కుల గణన తరువాత ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఆ రెండు పూర్తికావడానికి ఏడాదిన్నర సమయం పడుతుంది. ఈ లెక్కన 2028లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే అటువంటి పరిస్థితి ఉండదని.. జూన్ నెలలోపు స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిచేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
* ముందుగా పంచాయతీ..
ముందుగా పంచాయతీ ఎన్నికలకు( Panchayati elections) సంబంధించి పూర్తిచేయాలని.. తరువాత మండల జిల్లా పరిషత్ ఎన్నికలు.. చివరిగా మున్సిపల్, నగరపాలక సంస్థ ఎన్నికలు జరపాలన్నది ప్రభుత్వ ప్రణాళికగా తెలుస్తోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. సంక్షేమ పథకాలతో పాటు పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తోంది. ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుంజుకోలేదు. అందుకే ఎంత మాత్రం జాప్యం చేయకుండా.. వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేయాలని కూటమి ప్రభుత్వం గట్టి ప్రయత్నం లో ఉంది. అందుకే బడ్జెట్ సమావేశాల తర్వాత నేరుగా పంచాయితీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వెల్లడించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.
* అధికార పార్టీకి అనుకూలం..
ఏపీలో అధికార పార్టీగా కూటమి ఉంది. మూడు పార్టీల కలయికతో బలంగా కనిపిస్తోంది. తెలంగాణలో( Telangana) కాంగ్రెస్ అధికారంలో ఉంది. కానీ అక్కడ గులాబీ పార్టీ సైతం క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సైతం బలపడేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇటువంటి సమయంలో అక్కడ పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ. మున్సిపల్ ఎన్నికల్లో కూడా చక్కటి పనితీరును కనబరిచింది. అధికార పార్టీగా తన ముద్ర వేసుకుంది. అక్కడ అధికార పార్టీకి అనుకూల ఫలితాలు రావడంతో.. ఇక్కడ కూటమి ప్రభుత్వం సైతం స్థానిక సంస్థల ఎన్నికలకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థలను చేజిక్కించుకోవడం ద్వారా.. మూడేళ్లలో అభివృద్ధి చేసి చూపించి 2029 ఎన్నికలకు వెళ్లాలన్నది కూటమి ప్రభుత్వ ఆలోచన.
* వైసీపీలో తర్జనభర్జన..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress )పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో తర్జనభర్జన పడుతోంది. ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అని ఆలోచనతో ఉంది. ఎందుకంటే అధికార పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల అనుకూలంగా ఉంటాయి. ఆపై కూటమి దూకుడు మీద ఉంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా ఉంటాయో చేసి చూపించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పరిస్థితి తమకు వస్తే ఎలా ఉంటుందో వారికి తెలుసు. ఆపై నాయకులు సైతం స్థానిక సంస్థల ఎన్నికల ఖర్చు పెట్టేందుకు వెనుకడుగు వేస్తున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తే క్యాడర్ నిర్లక్ష్యానికి గురవుతుందని.. చెదిరి పోతుందన్న ఆందోళన ఉంది నాయకత్వంలో. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలను న్యాయస్థానాల్లో సవాల్ చేస్తారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే వైసిపి హయాంలో ఇదే మాదిరిగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని చూసారు. కానీ వీలుపడలేదు. ఇప్పుడు కూడా ఆ పరిస్థితి ఉంటుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వచ్చిన తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.