Liquor Scam In AP: ఏపీలో( Andhra Pradesh) మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టించింది. ఇప్పటికీ ఆ స్కాం నకు సంబంధించి లోతైన విచారణ కొనసాగుతోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం తవ్వే కొద్ది అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. రోజుకు ఒక్కొక్కరు నిందితులు బయటపడుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకుంది. తాము అధికారంలో ఉన్నప్పుడు పెట్టినటువంటి కేసులే కదా అని చాలా తేలిగ్గా తీసుకుంది. కానీ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ, అరెస్టులు, కోర్టులో నమోదు చేస్తున్న చార్జిషీట్లు చూస్తే మైండ్ బ్లాక్ అవుతోంది. రాజ్ కసిరెడ్డి నుంచి నేటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వరకు అరెస్టుల పర్వం సంచలనమే. ఇక అంతిమ లబ్ధిదారుడే అంటూ బిగ్ బాస్ వైపు అందరి చూపు ఉంది. అయితే తాజాగా కోర్టులో దాఖలు చేసిన మూడో చార్జ్ షీట్ తో మరింత క్లారిటీ ఇచ్చింది సిట్. ఇదంతా తేలికైన వ్యవహారం కాదని.. చివరకు భారీ సంచలనమే నమోదు కాబోతుందని సంకేతాలు ఇచ్చింది.
* మూడో చార్జ్ షీట్ దాఖలు
ఇప్పటివరకు కోర్టులో రెండు చార్జ్ షీట్లు( chargesheets ) దాఖలు చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం. తాజాగా నిన్ననే మూడో చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, బాలాజీ కుమార్, నవీన్ కృష్ణ ప్రమేయంపై వివరాలను పొందుపరిచారు. అయితే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి సన్నిహిత, ఆయన హయాంలో పనిచేసిన కీలక అధికారుల పేర్లు మాత్రమే వచ్చాయి. అరెస్టులు కూడా జరిగాయి. అంటే ఈ స్థాయిలో మద్యం కుంభకోణం జరిగిందా? తలాపాపం ఇలా పిడికెడు అన్నట్టు.. మొత్తం ఒక సంక్షేమ పథకం వలే మద్యం కుంభకోణం దోపిడీ జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం బటన్ నొక్కుడు సంక్షేమ పథకాలే కాదు.. తమ వారికోసం.. తనకు ఉపయోగపడిన వారి కోసం.. ఉపయోగపడతారన్న వారి కోసం ఈ మద్యం కుంభకోణం జరిపించారా అనే అనుమానం కలగక మానదు.
* తొలుతా ఆ భావన..
లిక్కర్ స్కాం( liqour scam ) అనేది ఒక రాజకీయ ప్రేరేపిత అభియోగం అని అంతా భావించారు. చంద్రబాబు పై అక్రమ కేసులు బనాయించి 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉంచినట్టే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కుట్ర చేశారు అన్నది ఒక అభిప్రాయం. కానీ మద్యం కుంభకోణంలో రోజురోజుకు పెరుగుతున్న పాత్రధారులు, తెర వెనుక సూత్రధారులను ప్రత్యేక దర్యాప్తు బృందం బయటపెడుతోంది. కేవలం అభియోగాల రూపంలోనే కాకుండా పక్కా ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి. ఆపై టిడిపి అనుకూల మీడియాలో ఇందుకు సంబంధించిన ఫోటోలతో పతాక శీర్షికన కథనాలు వస్తున్నాయి. అంటే తవ్వే కొద్ది అక్రమార్కులు బయటపడుతూనే ఉన్నారు. కేవలం ఆ నలుగురే అనుకుంటే.. ఒక వ్యవస్థీకృతమైన కుంభకోణంగా ఇది కనిపిస్తోంది. ప్రతి ఛార్జ్ షీట్ మధ్య కొత్త వ్యక్తుల ప్రమేయం బయటపడుతోంది. వేలకోట్ల పక్క దారి అంటే ఆశ్చర్యపోయారు. కానీ ఇలా నిందితుల సంఖ్య పెరుగుతుండడం.. వ్యవస్థీకృత కుంభకోణం అని ఒక నిర్ధారణకు వస్తున్నారు సామాన్యులు. నిజంగా మద్యం కుంభకోణం అనేది దేశంలో అతిపెద్ద స్కామ్ గా స్పష్టమవుతోంది.