AP Liquor: ఐదేళ్లు పద్ధతిగా మద్యం వ్యాపారం

తనకు మేనిఫెస్టో భగవద్గీత, బైబిల్, ఖురాన్ తో సమానం అన్నారు జగన్. కానీ అదే నవరత్నాల్లో మద్య నిషేధం ఉందన్న విషయాన్ని మరిచిపోయారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం మద్య నిషేధం చేసి మహిళల కళ్ళల్లో ఆనందం నింపుతానని జగన్ ప్రకటించారు.

Written By: Dharma, Updated On : May 1, 2024 11:00 am

AP Liquor

Follow us on

AP Liquor: సాధారణంగా సారా, మద్యం షాపులను ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేసి.. బలవంతంగా విక్రయించడం సినిమాల్లో చూస్తుంటాం. ఏదైనా గ్రామంలో మోతుబారి, భూస్వాముల అండదండలతో చిన్న రౌడీలు అమ్మడం చూసి ఉంటాం. అయితే గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ సర్కార్ మద్యం వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా చేసుకుంది. ఇచ్చిందే బ్రాండ్, తాను చెప్పిందే తాగండి అంటూ మద్యం వ్యాపారం సాగింది. మద్యంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా.. మరి ఎంతోమంది అనారోగ్యానికి గురయ్యారు. కానీ ప్రజారోగ్యానికి ఎంత భంగం వాటిల్లితే.. అంత మద్యం వ్యాపారం చేసుకోవచ్చన్న కోణంలో ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటు.

తనకు మేనిఫెస్టో భగవద్గీత, బైబిల్, ఖురాన్ తో సమానం అన్నారు జగన్. కానీ అదే నవరత్నాల్లో మద్య నిషేధం ఉందన్న విషయాన్ని మరిచిపోయారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం మద్య నిషేధం చేసి మహిళల కళ్ళల్లో ఆనందం నింపుతానని జగన్ ప్రకటించారు. మద్య నిషేధం పేరుతో అధికారంలోకి రాగానే షాపులన్నింటినీ ప్రభుత్వ పరం చేశారు. అయితే ప్రభుత్వం నడిపితే ప్రజారోగ్యానికి పెద్దపీట వేయాలి. సరసమైన ధరలకు అందించాలి. కానీ ఈ రాష్ట్రంలో కనిపించని బ్రాండ్లు, ఎక్కడా వినిపించని ధరలతో గత ఐదు సంవత్సరాలుగా మద్యం వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగించారు.

ఈ ఐదేళ్ల వైసిపి పాలనలో లక్షన్నర కోట్ల మద్యం వ్యాపారం జరిగింది. అయితే దీనికి లెక్క పత్రం లేదు. కేవలం నోట్ ద్వారానే సాగింది. ఇదే అసలు దందా అనుకుంటే.. బ్లాక్ దందా మరొకటి. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చి అమ్ముకోవడంలో కూడా వైసీపీ నేతలు ముందంజలో ఉన్నారు. చీప్ లిక్కర్ ధర వాస్తవానికి 20 రూపాయలు ఉంటుంది. కానీ 150 రూపాయలకు పైగా విక్రయిస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారు అంటే షాక్కు కొట్టే ధరలు ఉంటే మద్యం బాబులు అటువైపు చూడరని సమాధానం చెబుతున్నారు. గత ఐదేళ్లుగా ఇటువంటి లాజిక్ తోనే గడిపేశారు. మద్యంతో ప్రజారోగ్యాన్ని పిప్పి చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరుతున్న వారి అనారోగ్యానికి మద్యమే కారణమని నివేదికలు చెబుతున్నాయి. వాస్తవానికి మద్య నిషేధం అసాధ్యం. అందుకే మద్యం విధానాన్ని అనుసరించే బాధ్యతాయుతమైన ప్రభుత్వం రావాలి. సొంత మద్యం అమ్ముకునే పాలకులు ఈ స్థాయిలో ఆలోచిస్తారో గత ఐదేళ్లుగా చూశాం. అందుకే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. మన మద్యం షాపుల వైపు చూసి ఓటు వేయాలి. సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి పాలకుల మాటలను పెడచెవిన పెట్టాలి.మద్యం విషయంలో జరిగిన మోసాన్ని నిలదీయాలి.