AP Politics: జగన్, రేవంత్, బాబు.. జైలుకుపోతే సీఎం గ్యారంటీ.. క్యూలో కేఏ పాల్!

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన కంపెనీలో పెట్టుబడులకు సంబంధించిన వివాదాల నేపథ్యంలో జైలుకు వెళ్లారు.

Written By: Dharma, Updated On : June 14, 2024 9:27 am

AP Politics

Follow us on

AP Politics: రాజకీయ నాయకులకు ఆశలు ఉండాలి. భవిష్యత్తును ముందే ఊహించాలి. దానికి అనుగుణంగానే అడుగులు వేయాలి.. ప్రస్తుతం కే ఏ పాల్ ఇదే దిశగా ఆలోచిస్తున్నారా? తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందే ఒక అంచనా వేసుకుంటున్నారా? అందులో భాగంగానే ముఖ్యమంత్రి అవుతానని ముందుగానే చెప్పేస్తున్నారా? ఏమో గుర్రం ఎగరావచ్చు అనే సామెత తన విషయంలో నిజమవుతుందని అనుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయో, లేదో తెలియదు గాని.. సోషల్ మీడియాలో మాత్రం ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటంటే..

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన కంపెనీలో పెట్టుబడులకు సంబంధించిన వివాదాల నేపథ్యంలో జైలుకు వెళ్లారు. జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఆయన రాజకీయాల్లో మరింత రాటు తేలారు. దీంతో 2019 ఎన్నికల్లో ఏకంగా 151 సీట్లు గెలుచుకొని సరికొత్త రికార్డు సృష్టించారు. ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపారు. ఇటీవల ఎన్నికల్లో దారుణమైన పరాజయాన్ని చవి చూశారు. కేవలం 11 సీట్లు మాత్రమే సాధించి, ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయారు.

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా.. అంతకుముందు ఓటుకు నోటు కేసులో జైలు శిక్ష అనుభవించారు. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. జైలు శిక్ష, పాదయాత్ర వల్ల ఆయనకు ప్రజల్లో సింపతి పెరిగిందని.. అందువల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.. పాదయాత్ర చేయడం వల్ల రేవంత్ మరింతగా ప్రజల్లోకి వెళ్లారని.. అందువల్లే ఆయన ముఖ్యమంత్రి కాగలిగారని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు..

ఇక ఏపీకి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లారు. రాజమండ్రి జైలులో విచారణ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన జైలుకు వెళ్లడం పట్ల జనాల్లో సానుభూతి పెరిగింది. జైలు నుంచి విడుదలయిన తర్వాత చంద్రబాబు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజల్లోకి వెళ్లారు.. బిజెపి, జనసేనతో పొత్తు పెట్టుకుని.. ఏపీలో ఏకపక్ష విజయాన్ని సాధించారు..

పై మూడు ఉదాహరణలు కళ్ళ ముందు కనిపిస్తుండడంతో.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మదిలో కొత్త కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆయన కూడా జైలుకు వెళ్లి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారట. సోషల్ మీడియాలో రూపొందించిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.. అయితే జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వివిధ కేసులలో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లారు. కానీ, పాల్ దేనికోసం జైలుకు వెళ్తాడు? ఆయన ఏ కేసులో ఇరుక్కున్నాడు? ఒక్కసారి కూడా ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాని అతడిని ఏ కారణం చేత జైలుకు పంపిస్తారనేది స్పష్టత లేదు. పాల్ సీఎం అవడం ఏమో గాని.. ఈ పోస్టు మాత్రం నెట్టింట తెగ వైరల్ గా మారింది.