YSR Congress: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర పై చాలా ఆశలు పెట్టుకుంది. అందుకే ఆ పార్టీ సీనియర్లకు ఇప్పుడు పెద్దపీట వేస్తోంది. శాసనమండలిలో వైసీపీ పక్ష నేతగా బొత్స సత్యనారాయణకు అవకాశం ఇచ్చింది. ఇక ధర్మాన ప్రసాదరావుకు తాడేపల్లి కార్యాలయ బాధ్యతలతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని ప్రచారం నడుస్తోంది. అయితే ఇదంతా ఉత్తరాంధ్రలోని ఉమ్మడి మూడు జిల్లాల్లో బలం పెంచుకోవడానికి స్పష్టమవుతోంది. ఉత్తరాంధ్రలో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఐదు పార్లమెంటు స్థానాలు కొనసాగుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో రెండు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానం మాత్రమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అయితే 2029 ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలని భావిస్తోంది ఆ పార్టీ. అయితే అసెంబ్లీ స్థానాలకు పర్వాలేదు కానీ.. పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసేందుకు ఆ పార్టీకి అభ్యర్థులు దొరకడం లేదు.
* అరకులో వైసీపీ ఎంపీ..
ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, అరకు, అనకాపల్లి, విశాఖపట్నం పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అందులో ఒక్క అరకులోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ తనుజారాణి ఉన్నారు. మిగతా చోట్ల కూటమి ఎంపీలే కొనసాగుతున్నారు. శ్రీకాకుళం నుంచి కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం నుంచి కలి శెట్టి అప్పలనాయుడు, విశాఖ నుంచి శ్రీ భరత్, అనకాపల్లి నుంచి సీఎం రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో సీఎం రమేష్ ఒక్కరే బిజెపి నుంచి ఎంపీగా ఉన్నారు. అయితే టిడిపి కూటమి నుంచి సిట్టింగ్ ఎంపీలు మరోసారి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం పోటీ చేసేందుకు నేతలు ముందుకు రావడం లేదు. దీంతో జగన్మోహన్ రెడ్డి ఆ బాధ్యతను బొత్స సత్యనారాయణకు అప్పగించినట్లు ప్రచారం నడుస్తోంది.
* శ్రీకాకుళంలో నేతల విముఖత..
శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు రామ్మోహన్ నాయుడు వరుసగా మూడుసార్లు ఎంపీ అయ్యారు. బలమైన అభ్యర్థిగా మారారు. ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనను ఢీకొట్టడం అంటే చాలా కష్టం. 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంలో మాత్రం రామ్మోహన్ నాయుడు గెలిచారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను ఐదు చోట్ల వైసిపి గెలిచింది. కానీ రామ్మోహన్ నాయుడు మాత్రం గెలిచారు ఎంపీగా. గడిచిన ఎన్నికల్లో ఆయనపై పోటీ చేసి ఓడిపోయారు పేరాడ తిలక్. 2019లో దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోయారు. 2014లో రెడ్డి శాంతి పోటీ చేసి అలానే ఓడిపోయారు. అయితే ఈసారి తమ్మినేని సీతారాం పోటీ చేస్తారని ప్రచారం నడిచింది. అయితే రామ్మోహన్ నాయుడు కు ధీటైన అభ్యర్థిని రంగంలోకి దించాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. కానీ ఎవరు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. అయితే ధర్మాన ఫ్యామిలీ నుంచి ఒకరిని బరిలో దించితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
* విజయనగరంలో వింత పరిస్థితి..
విజయనగరం ఎంపీగా ప్రస్తుతం కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ పై గెలిచారు. 2029 ఎన్నికల్లో మరోసారి బెల్లాన చంద్రశేఖర్ పోటీ చేస్తానని చెబుతున్నారు. కానీ ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు బొత్స ఝాన్సీ లక్ష్మి ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో ఆమె ఇదే స్థానం నుంచి ఎంపీగా ఉండేవారు. మొన్నటి ఎన్నికల్లో విశాఖ నుంచి ఆమె పోటీ చేశారు. మరోవైపు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఇక్కడ బొత్స సత్యనారాయణ నిర్ణయం పనిచేయనుంది.
* విశాఖలో ఆమెకు మాత్రమే..
విశాఖపట్నం నుంచి మరోసారి పోటీ చేసేందుకు మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఆసక్తి చూపిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన అసెంబ్లీకి పోటీ చేశారు. అయితే విశాఖ నుంచి మరోసారి బొత్స ఝాన్సీలక్ష్మీ అయితే బాగుంటుందని జగన్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. మరోవైపు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పోటీ చేస్తే బాగుంటుందని వైసీపీ క్యాడర్ అంటుంది. కానీ అమర్నాథ్ మాత్రం తాను పోటీ చేయనని తేల్చి చెబుతున్నారు. తనకు విశాఖ నగరం పరిధిలో ఏదో ఒక అసెంబ్లీ స్థానం టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు.
* అనకాపల్లిలో నో ఛాన్స్..
అనకాపల్లి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేశారు బూడి ముత్యాల నాయుడు. మాడుగుల నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయనను జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లోకి తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా సీఎం రమేష్ రంగంలోకి దిగారు. దీంతో జగన్మోహన్ రెడ్డి బూడి ముత్యాల నాయుడు తో పోటీ చేయించారు. కానీ ఆయనకు ఓటమి తప్పలేదు. మరోసారి ఎంపీగా పోటీ చేయాలని జగన్మోహన్ రెడ్డి సూచిస్తున్నారు. కానీ అందుకు ముత్యాల నాయుడు సుముఖంగా లేరు. తిరిగి మాడుగుల అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తానని చూస్తున్నారు. అయితే అరకులో మాత్రం మరోసారి డాక్టర్ తనుజారాణికి అవకాశం ఇవ్వనున్నారు. ఆమె కాకుంటే మాత్రం మాజీ ఎంపీ బొడ్డేటి మాధవికి అవకాశం కల్పిస్తారు. అయితే వైసీపీలో ఉన్న నేతలంతా అసెంబ్లీ వైపు మొగ్గు చూపుతున్నారే కానీ.. పార్లమెంట్ స్థానాలపై మాత్రం ఆసక్తి కనబరచడం లేదు.